Goodnews for Loan borrowers: లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్.. తగ్గనున్న ఈఎంఐ వాల్యూ.!
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:20 PM
ఆర్బీఐ తాజాగా రెపో రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించడంతో లోన్లు తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఆయా లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ విలువ తగ్గే అవకాశముంది. ఫలితంగా వారు లోన్ తీసుకున్న గరిష్ఠ కాలపరిమితిలో భారీ మొత్తంలో ఆదా చేయనున్నారు. అదెలాగంటారా.? ఇదిగో ఆ వివరాలు మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గడంతో 5.50 శాతంగా ఉన్న రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. దీంతో వడ్డీ రేట్ల(Interest Rates) తగ్గింపుతో దేశ వ్యాప్తంగా బ్యాంకులు తమ లోన్ వడ్డీ రేట్లను త్వరలోనే సవరించనున్నాయి. ఫలితంగా.. హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. ఇది సామాన్యుడికి గొప్ప ఊరట కలిగించే నిర్ణయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఆర్బీఐ తాజా నిర్ణయంతో హోమ్ లోన్ ఖాతాదారుల చెల్లింపు విధానం ఎలా ఉంటుందో ఓసారి పరిశీలిస్తే.. 8.5 శాతం వడ్డీ రేటుతో 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్ల చొప్పున కట్టేందుకు తీసుకున్న లోన్.. 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపుతో 8.25 శాతం వడ్డీతో కట్టాల్సి ఉంటుంది.
ఉదాహరణకు రూ.25లక్షల హోమ్ లోన్‌ను వివిధ కాల పరిమితుల్లో చూస్తే..
రూ.25 లక్షలు హోమ్ లోన్ 15 ఏళ్ల కాల పరిమితితో తీసుకున్నట్టయితే గతంలో 8.5 శాతం వడ్డీతో రూ.24,254 ఈఎంఐ కట్టాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం.. 8.25 శాతం వడ్డీతో రూ.24,254 ఈఎంఐ చెల్లిస్తే చాలు. ఇలా మొత్తం కాల పరిమితిలో రూ.65,696 ఆదా చేసుకునేందుకు వెసులుబాటు ఏర్పడింది.
ఇదే రూ.25 లక్షల మొత్తాన్ని 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నట్టయితే.. గతంలో రూ.21,696 ఈఎంఐ కట్టాల్సి ఉండగా.. తాజాగా రూ.21,302 పే చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తమ్మీద రూ.94,545 సొమ్ము ఆదా అవనుంది.
ఇంతే రూ.25 లక్షల మొత్తాన్ని 25 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నట్టయితే రూ.20,131 చొప్పున కాకుండా రూ.19,711 కట్టాల్సి ఉంటుంది. ఫలితంగా రూ.1,25,827 ఆదా అవుతుంది.
ఇక 30 ఏళ్లకు రూ.19,223 ఈఎంఐ కట్టే రుణ గ్రహీతలు రూ.18,782 చొప్పున చెల్లించడం వల్ల రూ.1,58,822 మొత్తం తగ్గించబడుతుంది.
ఇదే తరహాలో రూ.50లక్షలు, రూ.75లక్షలు, రూ.1 కోటి మొత్తానికి పోల్చి చూస్తే..
రూ.50 లక్షల రుణానికి ప్రస్తుతం రూ.43,391 ఈఎంఐతో కట్టాల్సిన వారు.. తాజా తగ్గింపుతో రూ.42,603(8.25 శాతం వడ్డీ రేటు ప్రకారం) చొప్పున చెల్లిస్తూ 20 ఏళ్లకు రూ.1,89,091 ఆదా చేస్తారు.
రూ.75 లక్షల రుణం తీసుకున్న వారు ప్రస్తుతం రూ.60,392 ఈఎంఐ ద్వారా చెల్లించేవారు తగ్గింపు తర్వాత రూ.59,134 పే చేయాల్సి ఉంటుంది. ఇలా వీరికి 25 ఏళ్లలో రూ.3,77,481 నగదు ఆదా అవుతుంది.
రూ.1 కోటి రుణ గ్రహీతలు.. రూ.76,891 చొప్పున ప్రస్తుతం ఈఎంఐ ద్వారా చెల్లిస్తుండగా.. సవరించబోయే వడ్డీ రేట్ల ప్రకారం రూ.75,127 కట్టాల్సి ఉంటుంది. ఇలా వీరు 30 ఏళ్లలో రూ.6,35,287 సొమ్మును ఆదా చేసుకున్నట్టవుతుంది.
ఎవరికి ఎక్కువ లాభమంటే.?
రెపో రేటు తగ్గింపుతో ఫ్లోటింగ్ రేట్ లోన్ రుణాలు తీసుకున్న వారు వెంటనే ఈ ప్రయోజనాన్ని పొందుతారు. అనగా 2019 అక్టోబర్ 01 తర్వాత బ్యాంకు నుంచి లోన్ పొందిన కస్టమర్లు. ఈ గృహ రుణాల్లో చాలా వరకూ రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు.. ఆయా బ్యాంకులు వెంటనే వడ్డీ రేట్లను సవరిస్తాయి. దీంతో హోమ్ లోన్లు తగ్గింపులు వెంటనే అమల్లోకి వస్తాయి.
ఇవీ చదవండి:
5: పసిడి ధరల్లో తగ్గుదల.. స్థిరంగా వెండి
గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై మరో 0.25 శాతం కోత విధించిన ఆర్బీఐ