PAN-Aadhaar Link: రెండు రోజులు మాత్రమే ఛాన్స్.. లేదంటే ఇబ్బందులు తప్పవు..
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:48 PM
మన దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు చాలా ముఖ్యం. ఈ రెండు కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు పొందడంలో గానీ, గుర్తింపు విషయంలో గానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో గానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: మన దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు, పాన్ కార్డు చాలా ముఖ్యం. ఈ రెండు కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు పొందడంలో గానీ, గుర్తింపు విషయంలో గానీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో గానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉంటాడు. అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయాల్సి ఉంది. ఈ లింకింగ్ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఈ గడువు దాటితే పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణీత గడువులోగా పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ సేవల్లో అంతరాయం ఏర్పడటం గానీ, ఆర్థిక లావాదేవీల నిలుపుదల, ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే వీలైనంత త్వరగా పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.
గడువు దాటితే ఏమవుతుంది..?
ఏప్రిల్ 3, 2025న ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 1, 2024న లేదా ఆ తరువాత పాన్ కార్డులు పొందిన వారు డిసెంబర్ 31, 2025 లోపు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. నిర్ణీత తేదీ కంటే ముందుగా పాన్ కార్డ్ తీసుకున్న వారికి లింక్ కోసం గడువును మే 31, 2024 వరకు మాత్రమే ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఆధార్-పాన్ కార్డు లింక్ చేయకపోవడం ఆర్థిక పరమైన లావాదేవీలు నిలిపివేయడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి యాక్సెస్ ఉండదు. అలాగే గడువు ముగిసిన తరువాత పాన్-ఆధార్ లింక్ చేయడానికి రూ. 1000 ఛార్జీ చేయబడుతుంది. గడువులోగా లింక్ చేసుకోవడానికయితే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.
పాన్-ఆధార్ లింక్ చేయకపోతే..
నిర్ణీత గడువులోగా పాన్ కార్డ్-ఆధార్ కార్డు లింక్ చేయకపోతే.. ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం కష్టమవుతుంది. రిఫండ్‌లు నిలిచిపోయే అవకాశం ఉంది. పన్ను చెల్లింపులకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమవుతాయి. టీడీఎస్, టీసీఎస్ రేట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అలాగే, పన్ను చెల్లింపుదారులు ఫామ్ 26ఏఎస్ కు యాక్సెస్‌ను కోల్పోయే అవకాశం ఉంది. టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్ పొందడంలో కష్టంగా ఉంటుంది.
బ్యాంకింగ్ పనులు, ఆర్థిక లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి. పాన్ కార్డ్ సేవలకు అంతరాయం ఏర్పడటం వలన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులను పొందలేరు. రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయలేరు. అలాగే రూ. 10,000 కంటే ఎక్కువ బ్యాంకు లావాదేవీలను నిర్వహించలేరు. కేవైసీ చేయడంలోనూ ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వ సేవలు పొందడంలోనూ కష్టతరమవుతుంది. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలలో పెట్టుబడులు నిలిపివేసే అవకాశం ఉంది. ఇలా అనేక రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున నిర్ణీత గడువులోగా అంటే డిసెంబర్ 31వ తేదీలోపు పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ తప్పకుండా లింక్ చేయండి.
Also Read:
Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?
Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..
Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు