Milk Price Drop: సెప్టెంబర్ 22 నుంచి పాల ధరలు డౌన్..అముల్ సహా మరిన్ని బ్రాండ్లు
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:41 AM
దేశవ్యాప్తంగా వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పాల ఉత్పత్తుల్లో ప్రముఖ బ్రాండ్ అయిన అముల్ సహా పలు కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్ 22, 2025 నుంచి తగ్గించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశవ్యాప్తంగా వినియోగదారులకు శుభవార్త వచ్చేసింది. పాల ఉత్పత్తుల నుంచి ఉపశమనం వచ్చింది. దేశంలో ప్రముఖ బ్రాండ్ అముల్‌తో పాటు ఇతర ప్రముఖ డైరీ కంపెనీలు కూడా తమ పాల ఉత్పత్తుల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి (Milk Price Drop from September 22nd) రానుంది.
పెరుగుతున్న దైనందిన ఖర్చుల మధ్య ఇది ప్రతి కుటుంబానికీ ఊరట కలిగించే పరిణామం. ప్రధానంగా పాలు, పెరుగు, వెన్న, చీజ్ లాంటి ఉత్పత్తుల ధరలు తక్కువ కావడం వల్ల సాధారణ ప్రజలకు ఊరట లభించనుంది.
తగ్గింపునకు కారణం
ఈ క్రమంలో 700 కంటే ఎక్కువ అముల్ ఉత్పత్తుల ప్యాక్‌లపై ఈ ధరల తగ్గింపు వర్తించనుంది. ఇందులో వెన్న, నెయ్యి, చీజ్, పనీర్, చాక్లెట్లు, బేకరీ ఐటమ్స్, ఫ్రోజన్ స్నాక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ధర తగ్గింపునకు కారణం, ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) రేట్లను తగ్గించడం. దానివల్ల ఏర్పడిన లాభాన్ని అముల్ పూర్తిగా వినియోగదారులకు మళ్లించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
వెన్న, నెయ్యి ధరల్లో భారీ తగ్గింపు
100 గ్రాముల వెన్న ధర: రూ.62 నుంచి రూ.58కి తగ్గింది
500 గ్రాముల వెన్న: రూ.305 నుంచి రూ.285కి తగ్గింది
1 లీటర్ నెయ్యి ప్యాక్: రూ.650 నుంచి రూ.610కి
5 లీటర్ల టిన్: రూ.3,275 నుంచి రూ.3,075కి తగ్గింది
అముల్ తాజా టోన్డ్ మిల్క్ (1 లీటర్ UHT): రూ.77 నుంచి రూ.75కి
అముల్ గోల్డ్ మిల్క్ (1 లీటర్ UHT): రూ.83 నుంచి రూ.80కి
ఫ్రోజన్ పనీర్ (200g): రూ.99 నుంచి రూ.95కి
మదర్ డెయిరీ కూడా
ఈ ధర తగ్గింపు నేపథ్యంలో మరో ప్రముఖ బ్రాండ్ మదర్ డెయిరీ కూడా సెప్టెంబర్ 22 నుంచి తన ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఇతర సంస్థలు కూడా వారి ఉత్పత్తులపై తగ్గింపు ధరలను అందించే అవకాశం ఉంది. ఈ దసరా, దీపావళి పండుగల సమయంలో వినియోగదారులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ధరలు తగ్గించడంతో వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి