Share News

PAN Card Loan Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో లోన్ తీసుకున్నారా.. ఇలా ఈజీగా తెలుసుకోండి

ABN , Publish Date - Oct 05 , 2025 | 06:28 PM

ఇటీవల కాలంలో సైబర్ మోసాలతోపాటు పాన్ కార్డ్ చీటింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మీ పాన్ కార్డ్ ఉపయోగించి ఎవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. ఇలాంటి క్రమంలో మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

PAN Card Loan Misuse: మీకు తెలియకుండా మీ పేరుతో లోన్ తీసుకున్నారా.. ఇలా ఈజీగా తెలుసుకోండి
PAN Card Loan Misuse

ఇటీవల సైబర్ మోసాలు, పాన్ కార్డ్ దుర్వినియోగం కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. పాన్ కార్డ్ ఆధారంగా చేసుకుని మీ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం మోసగాళ్లకు ఈజీ అవుతోంది. ముఖ్యంగా పాన్ కార్డ్ ఆధారంగా అక్రమంగా లోన్ తీసుకోవడం లేదా ఆర్థిక అనుమతులు పొందడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ దెబ్బ తింటుంది.

మీరు తీసుకోని లోన్ కూడా మీ క్రెడిట్ రిపోర్ట్‌లో చేరుకుంది. తద్వారా మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. కాబట్టి మీ పాన్ కార్డ్ సురక్షితంగా ఉంచుకోవడం, మోసాలను గుర్తించి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి

మీ పేరు మీద ఎవరైనా లోన్ తీసుకున్నారా అని తెలుసుకోవడానికి సులభమైన మార్గం మీ క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయడం. CIBIL, Experian, Equifax, CRIF High Mark వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ కార్డ్‌తో లింక్ అయిన లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌ల వివరాలను స్టోర్ చేస్తాయి. మీ పాన్ కార్డ్, మొబైల్ నంబర్ ధృవీకరణతో ఏటా ఒకసారి ఉచిత క్రెడిట్ రిపోర్ట్‌ను పొందవచ్చు. రిపోర్ట్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. మీకు తెలియని లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌లు ఉంటే, అది మోసానికి సంకేతం కావచ్చు.

2. హెచ్చరిక సంకేతాలు

మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేస్తున్నప్పుడు, మీరు దరఖాస్తు చేయని లోన్‌లు, తప్పుడు అకౌంట్ నంబర్లు, తెలియని రుణదాతల పేర్లు అనుమతించని కొత్త హార్డ్ ఇంక్వైరీలు ఉంటే జాగ్రత్తగా గమనించండి. ఇవి మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు సూచిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ అనుమానాస్పద ఎంట్రీలు కనిపిస్తే, వెంటనే చర్య తీసుకోవడం మంచిది.


3. మోసపూరిత లోన్ కనిపిస్తే ఏం చేయాలి?

మీ పేరు మీద ఎవరైనా మోసపూరితంగా లోన్ తీసుకున్నట్లు గుర్తిస్తే, వెంటనే ఆ రుణదాతకు సమాచారం ఇవ్వండి. క్రెడిట్ బ్యూరోతో ఆ రికార్డ్‌ను డిస్ప్యూట్ చేయండి. చాలా బ్యూరోలు ఆన్‌లైన్‌లో డిస్ప్యూట్ సౌకర్యం కల్పిస్తాయి. మీ గుర్తింపు రుజువు, లోన్ వివరాలు, సంతకం చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలి. అదనంగా, మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ సెల్‌లో పాన్ కార్డ్ దుర్వినియోగం గురించి ఫిర్యాదు చేయండి.

4. భవిష్యత్తులో పాన్ కార్డ్ దుర్వినియోగాన్ని నివారించండి

మీ పాన్ కార్డ్‌ను అసురక్షిత వెబ్‌సైట్‌లు, యాప్‌లు లేదా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. అవసరం లేనప్పుడు ఎవరికీ ఇవ్వకండి. మీ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే, వెంటనే రీప్రింట్ కోసం దరఖాస్తు చేసి, తర్వాతి కొన్ని నెలలు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను గమనిస్తూ ఉండండి. ఆర్థిక ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించండి. మీ పాన్‌తో లింక్ అయిన లోన్‌లు లేదా క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి SMS లేదా ఈమెయిల్ అలర్ట్‌లను ఆన్ చేయండి.


5. జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి

మోసపూరిత లోన్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను, ఆర్థిక పరపతిని దెబ్బతీస్తాయి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా మోసాలను ముందుగానే గుర్తించవచ్చు. ఏదైనా దుర్వినియోగం కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోండి. మీ పాన్ కార్డ్‌ను మీ బ్యాంక్ పిన్ లేదా ఆధార్ కార్డ్‌లా జాగ్రత్తగా భద్రపరచుకోండి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2025 | 06:29 PM