Stock Market: ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ ఢమాల్.. నష్టాలే నష్టాలు..
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:10 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారంలో వరుసగా మూడో రోజు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ నష్టాలను చవిచూశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్లు (stock market) ఈరోజు కూడా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడో రోజు మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నాటికి సెన్సెక్స్ 475 పాయింట్లు తగ్గిపోగా, నిఫ్టీ కూడా 140 పాయింట్లు బలహీనపడింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 256 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 457 పాయింట్లు తగ్గింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
టాప్ 5 స్టాక్స్
ఈ నేపథ్యంలో భారత్ ఎలక్ట్రానిక్స్, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, అపోలో హాస్పిటల్, టాటా కంన్య్జూమర్స్, ట్రెంట్, టెక్ మహీంద్రా, లార్సెన్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. దీంతోపాటు ఆటో, రియాలిటీ, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.
మార్కెట్ పతనానికి కారణాలు
విదేశీ ఫండ్స్ దేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం, అమెరికా మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధం భయాలు మార్కెట్ పతనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా భారతీయ స్టాక్‌లలో పతనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 500 స్టాక్‌లలో 404 పడిపోయాయి. నిఫ్టీ 500 ఇండెక్స్ దీని 200 రోజుల మూవింగ్ యావరేజ్ (DMA) కంటే తక్కువకు చేరుకుంది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఐలలో భారీగా అమ్మకాలు జరిగాయి. దీని కారణంగా మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఈ క్రమంలో ఎఫ్‌ఐఐల నగదు, ఇండెక్స్, స్టాక్ ఫ్యూచర్‌లతో సహా దాదాపు రూ. 7000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇక దేశీయ ఫండ్స్ రూ. 4000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి.
ప్రపంచ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే..
అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఈ క్రమంలో డౌ జోన్స్ 275 పాయింట్లు కోలుకుని 125 పాయింట్ల లాభంతో ముగిసింది. కానీ టెస్లా 6% తగ్గడంతో నాస్డాక్ 70 పాయింట్లు పడిపోయింది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లను తగ్గించడానికి తొందరపడటం లేదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం GIFT నిఫ్టీ 35 పాయింట్ల పెరుగుదలతో 23,189 వద్ద ట్రేడైంది. జనవరి నెల రిటైల్ ద్రవ్యోల్బణం నేడు ప్రకటించనుండగా డౌ ఫ్యూచర్స్ మందగించింది. కమోడిటీ మార్కెట్లో బంగారం ధర గతకాల గరిష్ట స్థాయికి చేరింది. కానీ నేడు $40 తగ్గి $2925 స్థాయిలో ఉంది. వెండి ధర $32 పైన స్థిరంగా ఉంది.