Employment Growth: ద్వితీయార్ధంలో కొలువుల జాతర
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:51 AM
దేశంలో ఉపాధి మార్కెట్ వర్తమాన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జోరందుకోనుంది. పలు యాజమాన్యాలు తమ సంస్థల్లో కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలియచేశాయి. దేశంలో ఉద్యోగాల మార్కెట్ ధోరణిపై నౌకరీ నిర్వహించిన ద్వైవార్షిక సర్వేలో...
చీన్యూఢిల్లీ: దేశంలో ఉపాధి మార్కెట్ వర్తమాన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జోరందుకోనుంది. పలు యాజమాన్యాలు తమ సంస్థల్లో కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు తెలియచేశాయి. దేశంలో ఉద్యోగాల మార్కెట్ ధోరణిపై నౌకరీ నిర్వహించిన ద్వైవార్షిక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 72% మంది యాజమాన్య ప్రతినిధులు కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా సిబ్బంది విస్తరణ చేపట్టనున్నట్టు తెలిపారు. ద్వితీయార్ధంలో కొత్తగా కొంత మందిని ఉద్యోగాల్లో చేర్చుకునే యోచన ఉన్నట్టు 94% మంది తెలియచేశారు. దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 1,300 మంది యాజమాన్య ప్రతినిధులు అందించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పలువురు ఉద్యోగాలు కోల్పోతారన్న భయాలు విస్తృతంగా వ్యాపించిన వాతావరణంలో కూడా ఉద్యోగ మార్కెట్‌పై ఏఐ ప్రభావం అంతగా ఉంటుందని తాము భావించడంలేదని 87% మంది అన్నారు. పైగా ఉపాధి మార్కెట్‌కు ఏఐ చోదకశక్తిగా ఉంటుందని 13% మంది అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ప్రయోజనం పొందే రంగాల్లో ఐటీ (42%), అనలిటిక్స్ (17%), బిజినెస్ డెవల్‌పమెంట్ (11%) ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ప్రధానంగా ఏఐ ఆధారిత అవకాశాలు పెరుగుతాయన్నారు. నికరంగా అదనపు సిబ్బందిని నియమించుకోవడం ద్వారా సిబ్బంది విస్తరణ చేపట్టనున్నట్టు 72% మంది చెప్పడం ప్రోత్సాహకరమైన అంశమని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయెల్ అన్నారు.
కొత్త టెక్నాలజీలకే డిమాండు
స్పెషలైజ్డ్ టెక్నాలజీ విభాగాల్లో కొత్త ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుందన్న సంకేతాలతో దేశంలో ఉపాధి సెంటిమెంట్ బల పడిందని నౌకరీ ఆ నివేదికలో తెలిపింది. 37% యాజమాన్యాలు ఐటీ విభాగంలో కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలపడం విశేషం. అయితే సాంప్రదాయిక టెక్నాలజీల కన్నా నూతన టెక్నాలజీ విభాగాల్లోనే కొత్త ఉద్యోగాల కల్పన జరుగనుంది. మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ ఆధారిత టెక్నాలజీ విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడం విభిన్న రంగాల పరిశ్రమలకు తప్పనిసరి అయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అనుభవం విషయానికి వస్తే 4-7 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి డిమాండు అధికంగా ఉన్నట్టు తేలింది. అనుభవం ఉన్న వారిని ఉద్యోగాల్లో చేర్చుకోవాలనుకుంటున్నట్టు 47% మంది తెలిపారు. ఎంట్రీ స్థాయి (మూడేళ్ల లోపు అనుభవం) ఉద్యోగులను నియమించుకుంటామని 29% మంది చెప్పగా 8-12 సంవత్సరాల అనుభవం గల వారిని తీసుకుంటామన్న వారి సంఖ్య 17% ఉంది. 13-16 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని తీసుకుంటామన్న వారి సంఖ్య కేవలం 3% ఉంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి