ఇది తెలుసా.. కళ్లు, ముక్కు, నోరు వంటి భాగాలకు కూడా ప్రత్యేక బీమా
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:07 AM
ఏ క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఆరోగ్యం, ఇళ్లు, కారు, బైక్ ... ఇలా అన్నింటికీ బీమా చేసి ధీమాగా బతికేస్తుంటారు. అయితే బీమాలో కూడా సెలబ్రిటీల తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రిటిష్ నటి, గాయని సింథియా ఎరివో ఇటీవలే తన నవ్వుకు బీమా చేసి వార్తల్లో నిలిచారు.
ఏ క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఆరోగ్యం, ఇళ్లు, కారు, బైక్ ... ఇలా అన్నింటికీ బీమా చేసి ధీమాగా బతికేస్తుంటారు. అయితే బీమాలో కూడా సెలబ్రిటీల తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రిటిష్ నటి, గాయని సింథియా ఎరివో ఇటీవలే తన నవ్వుకు బీమా చేసి వార్తల్లో నిలిచారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా... తమ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకున్న సెలబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. వారి ఆసక్తికరమైన బీమా సంగతులే ఇవి...
మొత్తంగా శరీరానికి ...
‘జేమ్స్‌బాండ్ 007’ గా ఎందరో నటులు అద్భుతంగా నటించారు. వాళ్లందరిలోకీ భిన్నమైన నటుడు డేనియల్ క్రేగ్. ఆయన మొత్తం అయిదు చిత్రాల్లో బాండ్‌గా నటించారు. పదహేనేళ్ల పాటు ఆ పాత్రలో ఉన్న నటుడిగా అరుదైన రికార్టు సాధించారు, బాండ్ పాత్రధారుల్లో అత్యంత ధనికుడు కూడా ఈయనే. ‘క్యాసినో రాయల్’ క్రే గ్ తొలి బాండ్ చిత్రం. రెండో జేమ్స్‌బాండ్ చిత్రం ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్’ షూటింగ్‌కి ముందు ఆయన తన మొత్తం శరీరాన్ని 9.5 మిలియన్ డాలర్లకు ఇన్సూరెన్స్ చేయించారని మీడియా కథనాలు ప్రచురించాయి. సినిమాలో స్టంట్ సీన్లను ఆయనే స్వయంగా చేయడం విశేషం. అంతకుముందు షూటింగ్‌లో ప్రమాదం జరిగి ఆయన గాయపడ్డారు. అందుకే రిస్క్ ఎందుకనే ‘టోటల్ బాడీ’కి బీమా చేయించారు డేనియల్.

నవ్వుకు నజరానా!
జీవుల్లో ఒక్క మనిషికి మాత్రమే ఉన్న వరం నవ్వు. అందరూ నవ్వుతారు. కానీ కొందరు నవ్వితే రత్నాలు రాలుతోన్నట్టు ఉంటుంది. అలాంటి అందమైన నవ్వు నటి, గాయని సింథియా ఎరివో సొంతం. బ్రిటన్‌కు చెందిన సింథియా గ్రామీ, ఎమ్మీ, టోనీ వంటి అవార్డులు పొందింది. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయిన నటి. ఎరివో ముందు పళ్లల్లో కొంచెం గ్యాప్ ఉంటుంది. దానివల్ల తన నవ్వు ప్రత్యేకంగా ఉంటుందని సింథియా గ్రహించారు. అందుకే ఆమె తన నోటిని 16.5 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేసుకున్నారు. ‘నోటికి కూడా బీమానా?’ అని అందరూ ఆశ్చర్యపోయారు. మౌత్‌వాష్ కంపెనీ లిస్టెరిన్ నిర్వహించే ‘వాష్ యువర్ మౌత్’ కార్యక్రమానికి ఎరివో ప్రచారకర్త. నోటి శుభ్రత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఎరివో ప్రచారం చేస్తుంటారు. తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చిన నవ్వుకు నజరానాగా బీమా చేయించానని అంటారు ఎరివో.
పొడుగుకాళ్ల సుందరి
సంగీతం ద్వారా బిలియనీర్ అయిన తొలి వ్యక్తి టేలర్ స్విఫ్ట్. 2008లో ‘యు బిలాంగ్ విత్ మి’ పాటతో గొప్ప పాపులారిటీ సాధించిన ఈ అమెరికన్ పాప్ సింగర్ ఇప్పటిదాకా ఎన్నో సంగీత విభావరిలు నిర్వహించారు. పాటతో పాటు ఆమె పొడవాటి కాళ్లూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 2015 వరల్డ్‌టూర్ సందర్భంగా టేలర్ తన కాళ్లను 40 మిలియన్ డాలర్లకు బీమా చేశారనే వార్తలు వచ్చాయి. యాత్రల్లో, స్టేజీ మీద నృత్యాల్లో కాళ్లకు దెబ్బలు తగులుతాయనే భయంతో ఆమె అంత మొత్తం బీమా చేసిందని అంటారు. అయితే ఆమె దీన్ని ధ్రువీకరించలేదు. ఓసారి తన పెంపుడు పిల్లి కాలిపై గీరితే... గాయం అయిన ఫోటో పెడుతూ ‘మంచి పనిచేశావ్ మెరిడిత్ (పిల్లి), ఈ గాయానికి 40 మిలియన్ డాలర్లు రుణపడ్డావ్’ అని క్యాప్షన్ పెట్టింది. దాంతో టేలర్ కాళ్లకు బీమా చేయించిందన్నారు.

క్రేజీ... కిమ్...
అమెరికా సోషలైట్లలో నిత్యం వార్తల్లో ఉంటుంది ‘కిమ్ కర్దాషియా’. రియాలిటీ టీవీ స్టార్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, ఆంత్రోప్రెన్యూర్‌గా కిమ్‌ని అభివర్ణించాలి. 2007లో ‘కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్స్’ ఫ్యామిలీ రియాలిటీ షో ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. కిమ్‌ను సౌందర్యదేవతగా ఆరాధించేవాళ్లు ఎందరో. కెకెడబ్ల్యు బ్యూటీ, కెకెడబ్ల్యు ఫ్రాగ్నెన్స్ పేరుతో అనేక సౌందర్యోత్పత్తుల కంపెనీలను ఆమె నిర్వహిస్తున్నారు. కిమ్ కర్దాషియా 21 మిలియన్ డాలర్లకు తన పిరుదులను బీమా చేయించారని చెబుతారు. పాలసీ వివరాలు మాత్రం బయటికి రాలేదు. కానీ కిమ్ పృష్ణభాగానికి భద్రత ఎంతో అవసరం అని ఆమె భర్త బాహాటంగా పేర్కొన్న సందర్భం లేకపోలేదు.

దేవతా పాదాలు
రిహానా... ఈ పేరు వినగానే పాప్ ప్రపంచం ఊగిపోతుంది. విభిన్నమైన గళంతో ఎంతోమంది అభిమానుల్ని చూరగొన్న బార్బడోస్ పాప్ గాయని రిహానా. ఆమెను కేవలం పాప్‌స్టార్ అంటే పొరపాటే. యూత్ ఐకాన్, ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆమె పాడిన పాటలు 250 మిలియన్ల రికార్డులు అమ్ముడయ్యాయి. ఇదో అరుదైన రికార్డు. 2007లో ‘సెలబ్రిటీ లెగ్స్ ఆఫ్ ఎ గాడెస్’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అప్పుడే గిల్లెట్ సంస్థ రిహానా కాళ్లను మిలియన్ డాలర్లకు ఇన్సూరెన్స్ చేసి పత్రాలను అందించింది.
‘వేలు’ కాదు... కోట్లు...
సంగీత ప్రపంచంలో ఇంగ్లీష్ సంగీతకారుడు, గీత రచయిత, గాయకుడు, గిటారిస్ట్ కీత్ రిచర్డ్స్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రసిద్ధ ‘ది రోలింగ్ స్టోన్స్’ గిటారిస్ట్ ఆయనే. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్స్ అనేక బ్యాండ్లకు గిటార్ ప్లేయర్‌గా పనిచేశారు. బ్రియాన్ జోన్స్, మిక్ టేలర్, రోనీ వుడ్ వంటి ప్రసిద్ధ బ్యాండ్లకు గిటారిస్ట్‌గా ఉంటూ సత్తా చాటుకున్నారు. గిటార్ వాయించడానికి చేతి వేళ్లు ముఖ్యం. కాబట్టి ఆయన తన మిడిల్ ఫింగర్‌ను 1.7 మిలియన్ డాలర్లకు బీమా చేయించుకుని అందరూ ముక్కున వేలేసుకునేలా చేశారు.

గోల్డెన్ లెగ్
ఇటీవల ఓవల్‌లో జరిగిన అయిదో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో భారతదేశం గెలవడంలో కీలకపాత్ర మహ్మద్ సిరాజ్‌దే. అతడికి ఆరోజు ప్రేరణ కలిగించింది ఓ పోస్టర్. అది ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకి చెందిన ‘బిలీవ్’ వాల్‌పోస్టర్. క్రీడాభిమానులనే కాదు... క్రీడాకారులను కూడా ప్రభావం చేయగల వ్యక్తి రోనాల్డో. పోర్చుగల్‌కు చెందిన ఈ ఫుట్‌బాల్ ఆటగాడు ఇప్పటిదాకా 900 పైగా గోల్స్ చేశాడు. ఓ ఫుట్‌బాల్ ఆటగాడిగా రొనాల్డో తన కాళ్లను ఎక్కువగా ప్రేమిస్తాడనడంలో సందేహం లేదు. అందుకే ఆయన తన ఒక్కో కాలిని 45 మిలియన్ల డాలర్లకు బీమా చేయించాడు. ఫుట్‌బాల్ మైదానంలో రొనాల్డోకి ప్రత్యర్థిగా పేరు తెచ్చుకున్న అర్జెంటీనాకు చెందిన మెస్సీ తన ఎడమ కాలిని సుమారు 90 కోట్ల రూపాయలకు బీమా చేశాడనే వార్తలు వచ్చాయి. ఇదే నిజం అయితే క్రీడారంగ చరిత్రలో అతి పెద్ద బీమా ఇదే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
Read Latest Telangana News and National News