Dream11 Financial Services: ఆన్‌లైన్ గేమింగ్ నుంచి ఆర్థిక సేవల వైపు.. డ్రీమ్11 కొత్త బిజినెస్
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:33 PM
దేశంలో ఆన్‌లైన్ మనీ ఆధారిత గేమింగ్‌పై నిషేధం పడింది. దీంతో అనేక గేమింగ్ సంస్థలు కొత్త మార్గాలను వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే డ్రీమ్11 ఇప్పుడు కొత్త బిజినెస్ ప్రారంభించేందుకు సిద్ధమైంది.
చాలా మందికి డ్రీమ్11 ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సంస్థ కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. ఎందుకంటే ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత, డ్రీమ్11 మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ ఇప్పుడు ఆర్థిక సేవల రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డ్రీమ్ మనీ పేరుతో కొత్త యాప్‌తో (Dream11 Financial Services) వచ్చేస్తోంది.
కొత్త ప్రయాణం
డ్రీమ్ 11 స్పోర్ట్స్ భారతదేశంలో మనీ ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లలో కీలకంగా ఉండేది. కానీ, ప్రభుత్వం డబ్బు ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లపై నిషేధం విధించడంతో, వాళ్లు ఆ గేమ్‌లను మూసివేయాల్సి వచ్చింది. అయినా, డ్రీమ్ స్పోర్ట్స్ అక్కడితో ఆగిపోకుండా కొత్త బిజినెస్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ యాప్ గత కొన్ని నెలలుగా పైలట్ ప్రాజెక్ట్‌గా నడుస్తోంది. ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు.
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ యాప్‌లో చిన్న మొత్తం రూ.10 నుంచి బంగారం కొనుగోలు చేయొచ్చు. రూ.1,000 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే, ఇది ఒక సరికొత్త ఆర్థిక సేవల ప్లాట్‌ఫామ్‌గా రూపొందుతోందని చెప్పవచ్చు.
డ్రీమ్ సూట్ ఫైనాన్స్
డ్రీమ్ మనీ యాప్‌ని డ్రీమ్ స్పోర్ట్స్‌లో ఒక భాగమైన డ్రీమ్‌సూట్ అనే యూనిట్ అభివృద్ధి చేస్తోంది. డ్రీమ్‌సూట్ వెబ్‌సైట్‌లో వాళ్లు చెప్పిన ప్రకారం, త్వరలోనే సజావుగా ఆర్థిక సేవలు అందించే ప్లాట్‌ఫామ్‌ని లాంచ్ (Dream11 Financial Services) చేయబోతున్నారు. అంటే, డ్రీమ్11 ఇప్పుడు గేమింగ్ నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ వైపు మళ్లుతోందని స్పష్టమవుతోంది. ఈ కొత్త వెంచర్ ద్వారా డ్రీమ్ స్పోర్ట్స్ సామాన్యులకు సులువైన ఆర్థిక సేవలను అందించాలని చూస్తోంది. బంగారం కొనుగోలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు వంటి సేవలతో యూజర్లకు స్మార్ట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని భావిస్తోంది.
ఇంకా ఏం చేస్తోంది?
డ్రీమ్ స్పోర్ట్స్ కేవలం డ్రీమ్11 గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కే పరిమితం కాదు. వాళ్లు ఇప్పటికే ఎన్నో రంగాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించింది. వాటిలో స్పోర్ట్స్ ఎక్స్‌పీరియన్స్, ట్రావెల్ ప్లాట్‌ఫామ్, స్పోర్ట్స్ ఈవెంట్ టికెటింగ్, వ్యాపార సేవలు, గేమ్ డెవలప్‌మెంట్ యూనిట్ ఉన్నాయి.
దీంతోపాటు లాభాపేక్ష రహిత సంస్థ, సామాజిక సేవల కోసం కూడా పనిచేస్తోంది. ఈ విధంగా డ్రీమ్ స్పోర్ట్స్ ఒక్క గేమింగ్‌కే కాకుండా, వివిధ రంగాల్లో తమ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం డ్రీమ్ స్పోర్ట్స్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చినా, మరో వ్యాపారం పేరుతో కస్టమర్లకు సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి