Vijayasaireddy: ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి.. ఏ కేసులో అంటే
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:48 PM
Andhrapradesh: కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

అమరావతి/హైదరాబాద్, జనవరి 6: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasaireddy) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఈడీ ఆఫీసులో విచారణకు ఎంపీ హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హాయంలో కాకినాడ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ.3600 కోట్ల విలువైన షేర్లను కేవీరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. మనీలాండరింగ్ కోణంపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అప్పట్లో ఈడీ విచారణకు విజయసాయి హాజరుకాలేదు.
దీంతో తాజాగా మరోసారి ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు విచారణకు రావాల్సింది ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో మనీలాండరింగ్ అక్రమాలు జరిగినట్టు ఈడీ ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ‘అరబిందో’ డైరెక్టర్ శరత్‌చంద్రా రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు రాలేని విక్రాంత్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. సీపోర్టులో తన వాటాలను బెదిరించి లాక్కున్నారని కేవీరావు ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ బలవంతపు ‘డీల్’లో విజయ సాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డిదే కీలక పాత్ర! ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు గుర్తించడంతో విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి...
Nara Lokesh: ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
Loyola College Walkers: మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే
Read Latest AP News And Telugu news