Share News

Medical Colleges : తలకు మించిన ‘కాలేజీల’ భారం!

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:52 AM

వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పలు సరిదిద్దడానికి.. చేసిన అప్పులు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయాస పడుతోంది.

Medical Colleges : తలకు మించిన ‘కాలేజీల’ భారం!

  • వైద్య కళాశాలల కోసం కూడా జగన్‌ సర్కారు అప్పులే అప్పులు

  • అయినా ముందుకు సాగని నిర్మాణాలు

  • కాంట్రాక్టు సంస్థలకు 674 కోట్ల బాకీ

  • వాటిని ఇప్పుడు కడుతున్న కూటమి

  • విడతల వారీగా నిధులు విడుదల

  • తాజాగా రూ.285 కోట్లకు ఉత్తర్వులు

  • మరోవైపు ఫేజ్‌-2 కాలేజీల సమస్య

  • పెండింగులో 20 శాతం నిర్మాణాలు

  • వీజీఎ్‌ఫపై ప్రైవేటు మొగ్గు అంతంతే

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పలు సరిదిద్దడానికి.. చేసిన అప్పులు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ప్రయాస పడుతోంది. రూ.8,480 కోట్ల అంచనాలతో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం అప్పట్లో శ్రీకారం చుట్టింది. దీనిలో రూ.4,948 కోట్లు రుణాలు తీసుకుంది. అయితే, వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన నిర్మాణ వ్యయంలో సుమారు 25ు అంటే రూ.2125 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మూడేళ్ల వ్యవధిలో కనీసం 50 శాతం నిర్మాణ పనులు కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేసింది. పైగా.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.674 కోట్ల విలువైన పనులకు సంబంధించిన బకాయిలను కూటమి ప్రభుత్వంపై మోపింది. ఈ బకాయిలను కాంట్రాక్ట్‌ సంస్థలకు కూటమి ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రూ.285 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నాళ్ల కిందట కూడా దాదాపు రూ.110 కోట్ల పెండింగ్‌ బకాయిలు విడుదల చేసింది. ఇదిలావుంటే, జగన్‌ ప్రభుత్వం చేసిన 25 శాతం పనుల విలువ దాదాపు రూ.2,125 కోట్లు ఉంటే దీనిలో రూ.1,451 కోట్లు మాత్రమే కాంట్రాక్ట్‌ సంస్థకు చెల్లించింది. దీంతో మిగిలిన సొమ్ము రూ.674 కోట్లను కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్‌ సంస్థకు చెల్లించాల్సి వచ్చింది.


మరోవైపు 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు కొనసాగించాలంటే మరో రూ.3,532 కోట్లు కేటాయించాలి. ఇవి కాకుండా ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించాలి. తిరిగి ఆ రుణాలను కూడా ప్రభుత్వం విడతల వారీగా చెల్లించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త కాలేజీల నిర్మాణాలకు రూ.3532 కోట్ల నిధులు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో ‘సేఫ్‌ క్లోజర్‌’ అనే విధానం ద్వారా దాదాపు 10 కాలేజీల నిర్మాణాన్ని నిలుపుదల చేసింది.

పూర్తికాని వైనం

జగన్‌ ప్రభుత్వం ఫేజ్‌-1 కింద విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టింది. ఎన్నికలకు ముందు హడావుడిగా ఫేజ్‌-2 కింద పాడేరు, మర్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టాలని ప్రయత్నాలు చేసింది. కానీ, భవన నిర్మాణాలు పూర్తి కాక, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు కోరత వల్ల నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. పాడేరు మెడికల్‌ కాలేజీని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించడం తో ఆ కాలేజీలో మాత్రం 50 సీట్లలో అడ్మిషన్లకు అనుమతిచ్చింది. మిగిలిన ఏడు కాలేజీల్లో(పార్వతీపురం, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాప ట్ల, పెనుగొండ, పిడుగురాళ్ల) కనీసం పనులు కూ డా ప్రారంభించలేదు. ఇలాంటి తరుణంలో అడ్మిషన్లు జరుగుతున్న 6 కాలేజీలు(విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు) మినహా మిగిలిన 11 కాలేజీల నిర్వహణ సాధ్యం కాదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


వీజీఎఫ్‌ ఊసే లేదు!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మిగిలి న 10 మెడికల్‌ కాలేజీల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిల్లో ప్రభుత్వం లేదు. కాబట్టి వయబులిటీ గ్యాప్‌ ఫండ్స్‌(వీజీఎఫ్‌) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో ప్రైవేటు సంస్థలకు ఈ కాలేజీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. కానీ, ఈ వీజీఎఫ్‌ ద్వారా కాలేజీల నిర్మాణం సాఽ ద్యం అవుతుందా? ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీజీఎఫ్‌ కింద 40 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. 35 శా తం రాష్ట్ర ప్రభుత్వం.. 25 శాతం ప్రైవేటు సంస్థ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది కేవలం కాలేజీ నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే. ఇది కాకుండా కాలేజీ నిర్వహణ కోసం ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. అది కూడా ప్రతి ఏటా దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తాయా అంటే చెప్పలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం తొలుత వీజీఎఫ్‌ ద్వారా కాలేజీలు పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని భావిస్తున్నారు.

నిపుణుల మాట ఇదీ..!

ఫేజ్‌-2లో చేపట్టిన కాలేజీలకు సంబంధించి 80 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఫ్యాకల్టీ కొరతతో ఈ ఏడాది ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు నిలిచిపోయాయి. అయితే, ఆయా కాలేజీలను పూర్తి చేసి వచ్చే ఏడాది అడ్మిషన్లు కల్పించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఈ కాలేజీల కోసం ఖర్చు చేసిన రూ.1200 కోట్లు వృథా అవుతాయని అంటున్నారు. వంద సీట్లు కాకపోయినా కనీసం 50 సీట్లతో అయినా వాటిని ప్రారంభించాలని సూచిస్తున్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:52 AM