Singayya Case: అవి మరచి.. నంగనాచి కబుర్లేల జగన్..!
ABN , Publish Date - Jun 23 , 2025 | 07:53 PM
YS Jagana-Singayya: వైసీపీ అదినేత జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు ఎప్పుడైనా అడ్డు పెట్టానా, ఆంక్షలు విధించానా అని ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లి ..
అమరావతి, జులై 23: వైసీపీ అధినేత జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు ఎప్పుడైనా అడ్డు పెట్టానా, ఆంక్షలు విధించానా అని ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లి పరామర్శించడం ఎలా తప్పు అవుతుందని ఆయన ప్రశ్నించిన తీరు పార్టీల నేతలను ముక్కున వేలేసుకునేలా చేసింది. వీటి అన్నింటికీ మించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది తనకైనా, చంద్రబాబుకైనా, ఆటోమేటిక్ గా హక్కు కాదా అని ఆయన ప్రశ్నించడం గతాన్ని మరిచిపోయినట్లుగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటువంటి అమాయకపు ప్రశ్నలు వేసిన జగన్ గతాన్ని మరచిపోయారని, ఆయన మరోస్థితిలోకి వెళ్లిపోయారని ఇప్పుడు తెలుగుదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
బెట్టింగ్ లు కాసి, అప్పుల పాలై సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళ్లిన మాజీ సీఎం జగన్ పర్యటనలో ఇరువురు వ్యక్తులు మరణించిన వ్యవహారం వివాదం కావడంతో తొలిసారిగా జగన్ ట్విట్టర్లో స్పందించడం మరోసారి విమర్శలకు దారి తీసింది. తన పాలనలో శాంతి భద్రతలు, ప్రతిపక్ష నేతలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని జగన్ ఆ ట్వీట్ లో పేర్కొనడంపై తెలుగుదేశం ఆ ట్వీట్ పై మండిపడింది. చంద్రబాబు ఆనాటి ప్రతిపక్ష నేతగా, పర్యటనలకు వెళ్లిన సమయంలో పోలీసులు క్రూరంగా అడ్డుకున్న విషయం జగన్ మరచిపోతే ఎలా అని టీడీపీ ప్రశ్నించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను ఊరు నుంచి తరిమేసిన ఉదంతంతో ఆత్మకూరు వెళ్లేందుకు బయలుదేరిన చంద్రబాబును ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా గేటును తాళ్లతో కట్టేసిన విషయం జగన్ మరిచిపోతే ఎలా అని టీడీపీ ప్రశ్నించింది.
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లగా ఎయిర్ పోర్టులో చంద్రబాబును ఉదయం నుంచీ సాయంత్రం వరకు నిలిపివేయడంతో పాటు, ఆయన పైనే ఎదురు కేసు పెట్టిన విషయంతో పాటు, తిరుపతిలో స్థానిక సంస్థల ఎన్నికలలో జరుగుతున్న అరాచకాన్ని, దాడులకు గురైన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లగా, అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబును ఎయిర్ పోర్టులో నిలిపివేస్తే, ఆయన ఎయిర్ పోర్టులోనే నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన విషయం జగన్ ఎలా మరచిపోయారని రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విశాఖపట్నంలో నోవా టెల్ హోటల్ లో నిర్భంధించిన వైనాన్ని, విజయవాడకు వస్తున్న పవన్ కళ్యాణ్ ను జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారి వద్ద అడ్డుకుంటే, ఆయన రహదారిపైనే బైటాయించిన విషయాన్ని జగన్ మరచిపోయారా అని హోంమంత్రి అనిత నిలదీశారు.

దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనకు పిలుపునిస్తే, వారిపై కేసులు నమోదు చేయడం, గృహ నిర్భంధం చేయడం వంటి అంశాలను ఈ సందర్భంగా అనిత గుర్తు చేశారు. పార్టీ ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడుని అరెస్టు చేసి, 800కిలోమీటర్లు తీసుకురావడం, ఆయనకు మళ్లీ సర్జరీ చేయాల్సి రావడం వంటి విషయాలను జగన్ మరచిపోవడం వింతగా ఉందని అనిత వ్యాఖ్యానించారు. తనపై 23 కేసులు ఎలా నమోదు చేశారని ఆమె నిలదీశారు. ఇవన్నీ జగన్ ప్రభుత్వంలోనే జరిగాయని, తాను చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయని, వాటిని మరచిపోయి జగన్ మాట్లాడటం పై అనిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరోవైపు జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆ గ్రామంలో ఇరుకు రహదారులు ఉన్నాయని, అందువల్ల కేవలం మీ కాన్వాయ్ తో పాటు, మూడు వాహనాలు, వంద మంది పార్టీ కార్యకర్తలు, నేతలు మాత్రమే రావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను ఉల్లంఘించి జగన్ ఎలా వస్తారని హోంమంత్రి నిలదీశారు. కనీసం దయ, జాలి, మానవత్వం లేకుండా తన పార్టీ కార్యకర్త తాను ప్రయాణించే కారు కింద పడి మరణించినా పరామర్శించడం కానీ, లేదా ఆసుపత్రికి పంపడం, వంటి అంశాలు జోలికి వెళ్లని జగన్ ను ఏమనాలని అనిత ప్రశ్నించారు. మీరు పిలిస్తే వచ్చిన పార్టీ కార్యకర్త, పైగా దళితుడైన సింగయ్య పట్ల కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించిన తీరు మీరే ప్రశ్నించుకుంటే మంచిదని హితవు చెప్పారు. పోలీసులు ప్రాధమిక ఆధారాలను బట్టి గుంటూరు ఎస్పీ ఆరోజు మాట్లాడారాని, దర్యాప్తులో కొత్త విషయాలు, విజువల్స్ వెలుగులోకి రావడంతో ఇప్పుడు జగన్ పై కూడా కేసు పెట్టాల్సి వచ్చిందని అనిత వివరించారు. దర్యాప్తు లో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగానే కేసులు నమోదు చేస్తారని అనిత వివరించారు.

పైగా డ్రైవర్ ను మీరే ఇచ్చారని, ఆరోజు గవర్నమెంట్ డ్రైవర్, తోలుతున్న వెహికల్, మీరు ఇచ్చిన పైలెట్ వెహికల్స్, మీ రోప్ పార్టీ ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ సీఎం ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా అని జగన్ ప్రశ్నించడం వితండ వాదంగా మారింది. ఆరోజు ఎస్పీ ఘటనపై ఇచ్చిన స్టేట్‌మెంట్, మళ్లీ మార్చిన వైనం గురించి జగన్ తన ట్వీట్ లో ప్రశ్నించారు. తాను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు మాపార్టీ నాయకులు దురదృష్టకర సంఘటన జరిగిందని తన దృష్టికి తీసుకు వచ్చారని జగన్ అంగీకరించారు. వెంటనే తాను పత్తిపాడు పార్టీ ఇన్‌ఛార్జి కిరణ్, అంబటి రాంబాబును ఆస్పత్రికి పంపి, మరుసటి రోజు ఆ కుటుంబానికి పది లక్షలు ఆర్ధిక సాయం చేయాలని చెప్పానని తెలిపారు.
అయినా తమపై విష ప్రచారాలు చేయడం, మానవత్వం గురించి, నైతికత గురించి పాఠాలు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై అనిత స్పందిస్తూ జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు అని, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాట నిజమని, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పరామర్శకు బయలుదేరి ర్యాలీ చేసుకుంటూ వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. పైగా రఫ్పా రఫ్పా నరుకుతామని కార్యకర్త ప్రదర్శించిన ప్లకార్డును చూసి, మీడియా ప్రశ్నిస్తే.. అందులో తప్పేముందని సమర్ధించడం సిగ్గుచేటని అనిత మండిపడ్డారు.
జగన్ ట్వీట్‌లో ఒక అంశం మాత్రం స్పష్టంగా బహిర్గతమైంది. సింగయ్య కారు కింద పడి మరణించారని పేర్కొనడమే కాకుండా, ఆ దురదృష్టకరన సంఘటనను పార్టీ నేతలు తన దృష్టికి తీసుకు వస్తే.. తాను పది లక్షలు ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం చేయమని కోరానని చెప్పారే కానీ, కనీసం అటువైపు వెళ్లి పరామర్శ కూడా చేయలేదని పరోక్షంగా అంగీకరించారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే.. చివరకు ఆయన మాట్లాడే మైకు ప్రజలకు కనబడేందుకు ఎక్కిన స్టూల్‌ను కూడా లాక్కున్న వైనాన్ని జగన్ మరచిపోతే ఎలా అని అనిత ప్రశ్నించారు.

Also Read:
సారీ చెప్పి ఫోర్ కొట్టిన పంత్!
For More Andhra Pradesh News and Telugu News..