Share News

Ananthapur: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలను వదులుకుంటా..

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:56 PM

నాపై ఆరోపణలు చేయడం కాదు.. వాటిని నిరూపిస్తే రాజకీయాలను వదులుకుంటానని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమార్కుడు ఆదినారాయణేనన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

Ananthapur: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలను వదులుకుంటా..

- అక్రమార్కుడు ఆదినారాయణే..

- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

అనంతపురం: భూ అక్రమార్కుడు ఆదినారాయణేనని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి(Palle Raghunath Reddy) అన్నారు. ఆదినారాయణ భూ అక్రమాలపైన, తనపై చేసిన ఆరోపణల పైన సిట్టింగ్‌ జడ్జి లేదా ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసి విచారణ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరి భూముల జోలికీ పోవాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఏ మచ్చా లేకుండా ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సేవ చేస్తున్నానని వివరించారు.


పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరు కష్టాల్లో ఉన్నా ఆర్థికంగా సాయం చేస్తూ, వారి కుటుంబ సభ్యుడిగా అండగా నిలుస్తున్నానని పేర్కొన్నారు. జిల్లాలో విద్యాసంస్థలను స్థాపించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పించానని పేర్కొన్నారు. తనది ఒక వ్యవస్థ అని, తాను ఎంతో పద్ధతిగా ఉంటానని, ఎవరిజోలికీ పోనని అన్నారు. ఈ మధ్య గొడ్డుమర్రి ఆదినారాయణ అనే వ్యక్తి అనవసరంగా, ఆధారాలు లేకుండా తనపై అభాంబాలు వేస్తున్నారని, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.


pandu2.2.jpg

కొంతమంది సంఘాల నాయకులకు నిజాలు చెప్పకుండా, వారిని ప్రలోభపెట్టి అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని అన్నారు. తమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ కంపెనీలో ఏడుగురు డైరెక్టరల్లో ఆదినారాయణ ఒకరని, తమ కంపెనీలో మిగతా డైరెక్టర్లకు తెలియకుండా, నిబంధనలకు విరుద్ధంగా, ఫేక్‌ రెజల్యూషన్‌ చేసి కంపెనీకి సంబంధించిన 100 ఎకరాలకు పైగా భూమిని తన భార్య, బావమరిది, మామ, అన్న పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆరోపించారు. ఆ భూమిని 26 మందికి అమ్మి, వారిని కూడా మోసగించారని ఆరోపించారు. ఆదినారాయణ నుంచి తాము నష్టపోయిన భూమిని న్యాయస్థానం ద్వారా దక్కించుకుంటామని వివరించారు.


ఆ భూమిలో ఒక సెంటు కాజేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల నాయకులు వాస్తవాలు గమనించాలని కోరారు. ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లికి చెందిన 50 మందికిపైగా అమాయక గిరిజన రైతులకు సంబంధించిన 170 ఎకరాలను దౌర్జన్యంగా ఆదినారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట 1బి అడంగల్‌ చేయించారని, బ్యాంకుల్లో రూ.కోట్ల రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. అనంత లక్ష్మి కళాశాల ఎదరుగా సుమారు 50 ఎకరాల భూమిని అక్రమంగా పొందిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కియ చుట్టూ పదుల సంఖ్యలో రైతులను బెదిరించి, వారి భూములను ఆన్‌లైన్‌ చేసుకోలేదా అని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 04 , 2025 | 12:56 PM