Share News

KTR: అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:39 AM

అమెరికాలో వివిధ ఇబ్బందులలో పడే తెలుగు విద్యార్థులకు బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ న్యాయ సహాయం అందించడానికి హామీ ఇచ్చారు. విద్యార్థులను లక్ష్యానికి నిబద్ధంగా ముందుకు సాగాలని, చదువుకుని తిరిగి భారత్‌లో కంపెనీలు ప్రారంభించాలని సూచించారు.

KTR: అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : అమెరికా వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు పడే తెలుగు విద్యార్థులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నతవిద్య కోసం వెళ్లిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి బీఆర్‌ఎస్‌ అమెరికా విభాగం తరఫునన్యాయ సహాయం అందిస్తామన్నారు. అమెరికాలోని టెక్సాస్‌ యూనివర్సిటీ(డాలస్‌) విద్యార్థులతో మంగళవారం జరిగిన ముఖాముఖిలో వారు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగివస్తే ఆ విద్యార్థితోపాటు వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురవుతోందని, ఈ కారణంగానే తాము అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు. విద్యార్థులు అమెరికా చట్టాలు, ఆ సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసలుకోవాలని సూచించారు. లక్ష్యంవైపు సాగే క్రమంలో అవరోధాలు ఎదురైనా నిబద్ధతతో ముందుకు పోవాలన్నారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. కష్టపడితేనే కలలు సాకారమవుతాయనేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ జీవితమే సాక్ష్యమన్నారు. అమెరికాలో చదువుకుని భారత్‌కు తిరిగివచ్చాక.. కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లోని యువత భాగం కావాలని, మన దేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అక్కడి విద్యార్థులకు కేటీఆర్‌ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:39 AM