Eluru : ఆస్తి వివాదంలో తాతను చంపేశాడు
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:12 AM
ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో ఆయన మనవడు కీర్తితేజ(29)నే ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.

వ్యాపారవేత్త వీసీ జనార్దన్ రావు హత్య.. 70కి పైగా కత్తి పోట్లు
హైదరాబాద్/దెందులూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వెల్జన్ గ్రూపు ఆఫ్ ఇండస్ర్టీస్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు(85) హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదంలో జరిగిన ఘర్షణలో ఆయన మనవడు కీర్తితేజ(29)నే ఆయనపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. జనార్దన్ రావు నివాసంలోనే ఈ దారుణం జరిగింది. ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామానికి చెందిన జనార్దనరావు.. బేగంపేటలో నివాసముంటారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కూతురు సరోజిని దేవి భర్తతో విబేధాలు రావడంతో కొంతకాలంగా తండ్రితోనే ఉంటున్నారు. సరోజిని దేవి కుమారుడు కిలారు కీర్తి తేజ విదేశాల్లో ఉన్నత విద్య అనంతరం 2018 నుంచి మణికొండలో నివాసముంటున్నాడు. ఆస్తి, హోదా, వ్యాపారాల్లో గుర్తింపు విషయాల్లో కీర్తితేజ కొంతకాలంగా తాత, తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీ రాత్రి జనార్దన్ రావు ఇంటికి వచ్చిన కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో జనార్దన్‌రావును ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. జనార్దన్ రావు మెడపైనే 16 సార్లు వరకు పొడిచిన కీర్తితేజ.. మొత్తం 70కి పైగా కత్తిపోట్లు పొడిచాడు. దాడిని అడ్డుకోబోయిన తల్లి సరోజిని దేవిని దాదాపు 10 సార్లు పొడిచాడు. జనార్దన్‌రావు అక్కడికక్కడే మరణించగా సరోజిని దేవి ఆస్పత్రిపాలయ్యారు. కీర్తితేజను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రతన్‌టాటా సహాద్యాయి అయిన వీసీ జనార్దన్ రావు.. సేవ కార్యక్రమాల్లోనూ రతన్‌టాటాను మరిపించారు. కోట్ల రూపాయాలను సేవా కార్యక్రమాలకు వెచ్చించారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి పలు దఫాలుగా నగదు అందించారు. భక్తుల భోజన వసతుల అభివృద్ధికి టీటీడీకి రూ.50 కోట్లు, స్వగ్రామం కొవ్వలిలోని జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి రూ.5 కోట్లు అందించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి