Vizianagaram: బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - May 19 , 2025 | 10:05 AM
Syed Sameer: హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరు నిందితులను తెలుగు రాష్ట్రాల్లోని నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. ఈ సందర్బంగా వారి నుంచి పలు సంచలన విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది.
అమరావతి, మే 19: హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల కుట్రను తెలుగు రాష్ట్రాల్లోని నిఘా సంస్థలు భగ్నం చేశాయి. అందుకు సంబంధించి ఇద్దరు నిందితులు సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్‌లను పోలీస్ వర్గాలు ఇప్పటికే అరెస్ట్ చేశాయి. విచారణలో భాగంగా వీరి నుంచి పోలీసులు సంచలన విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సిరాజ్, సయ్యద్ సమీర్‌లు.. అహిం పేరిట సంస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరు.. దీని వేదికగా సంప్రదింపులు జరిపారు.
అలాగే సౌదీ అరేబియా నుంచి ఉగ్రవాద సంస్థ.. వీరిద్దరిని ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. సదరు ఉగ్రవాద సంస్థ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికి దిశానిర్దేశం చేసినట్లు కనుగొన్నారు. అదే విధంగా తమ ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు సైతం విస్తారించాలనే ప్రయత్నం వీరిద్దరు చేసినట్లు పోలీసులు నిర్దారించారు.
ఇక బాంబు పేలుళ్ల కోసం క్లోరేట్, సల్ఫర్‌తోపాటు పేలుడు పదార్థాలను ఈ నిందితులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఈ పేలుడ పదార్థాలపై ఆన్ లైన్ ద్వారా వీరు అవగాహన కల్పించుకున్నట్లు తెలుస్తోంది. మే 21, 22వ తేదీన విజయనగరంలో బాంబ్ పేలుళ్ల రీహార్సల్ చేయాలని వీరిద్దరు నిర్ణయించారు. ఈ కుట్రను సైతం పోలీసులు భగ్నం చేశారు.
మరోవైపు సిరాజ్, సయ్యద్ సమీర్‌లు ఇద్దరు.. మైనర్లతో తరచు సమావేశాలు నిర్వహించి.. ఉగ్రవాద కార్యకలాపాల గురించి వారికి వివరించినట్లు సమాచారం. హ్యాండ్లర్.. వీరికి అగ్గిపుల్ల మందుతో బాంబు ఎలా తయారు చేయాలో ఫైల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగానే ఈ ఇద్దరు బాంబు తయారు చేసినట్లు గుర్తించారు.
మరోవైపు వీరిద్దరికి 14 రోజులపాటు విజయనగరం కోర్టు రిమాండ్ విధించింది. అదీకాక ఆదివారం విజయనగరంలోని సిరాజ్ నివాసంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సిరాజ్ ఉర్ రెహమాన్ విజయనగరం వాసి కాగా.. సయ్యద్ సమీర్ సికింద్రాబాద్‌లోని బోయగూడ చెందిన వాడు.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ.. దేశంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులోబాగంగా దేశంలొని అన్ని ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. హైదరాబాద్ వేదికగా బాంబు పేలుళ్లకు చేసిన కుట్రను ఏపీ, తెలంగాణ నిఘా వర్గాలు భగ్నం చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
GVMC Dy Mayor: నేడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎంపిక
Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..
For AndhraPradesh News And Telugu News