Delhi: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై లోక్ సభలో చర్చ.. కేంద్రమంత్రి ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:27 PM
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, మొత్తం అప్పులు, బకాయిలు, రుణాలు సహా రూ.38,965 కోట్ల నష్టాల్లో సంస్థ ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు వెల్లడించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లింపులోనూ సంస్థకు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.
ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant)పై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం (Union Government) క్లారిటీ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt) కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ (Bhupathi Raju Srinivasa Varma) వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలనే ఉద్దేశంతోనే రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ (Special Package)ని ప్రకటించినట్లు లోక్ సభ( Lok Sabha) సాక్షిగా కేంద్ర మంత్రి తెలిపారు.
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై లోక్ సభలో బీజీపీ ఎంపీ సీఎం రమేశ్, జనసేన ఎంపీ బాలశౌరి ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి భూపతి రాజు క్లారిటీ ఇచ్చారు. ప్లాంట్‌ను కాపాడేందుకే రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఆమోదించినట్లు ఆయన స్పష్టం చేశారు. సంస్థని రక్షించుకోవాలనే ఆలోచనతోనే కేంద్రం వేల కోట్ల ప్రకటించి ముందడుగు వేసినట్లు చెప్పుకొచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, మొత్తం అప్పులు, బకాయిలు, రుణాలు సహా రూ.38,965 కోట్ల నష్టాల్లో సంస్థ ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు వెల్లడించారు. ఉద్యోగులకు జీతాలు చెల్లింపులోనూ సంస్థకు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యోగులకు కొద్దిమేర మాత్రమే వేతనాలు చెల్లించినట్లు ఆయన చెప్పారు. 2024 ఏప్రిల్, డిసెంబర్ మధ్య సంస్థ రూ.12,615 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, అయినా రూ.3,943 కోట్ల నష్టాన్ని చవిచూసిందని కేంద్రమంత్రి వెల్లడించారు. సంస్థ గురించి ఆందోళన చెంది, దాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీతో చర్యలు చేపట్టినట్లు భూపతిరాజు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MRI Scanning: డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.. భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య
YS Sharmila: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన