ReNew Power: ఏపీ సర్కార్‌తో రీన్యూ పవర్ కీలక ఒప్పందం
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:56 PM
ఏపీలో రూ.82 వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రీన్యూ పవర్ సంస్థ ఎంవోయూలు కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది.
విశాఖపట్నం, నవంబర్ 13: భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంటోంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి లోకేష్ ప్రకటించినట్లు ఇంధన రంగంలో రీన్యూ పవర్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రీన్యూ పవర్ ఈరోజు (గురువారం) ఒప్పందం చేసుకుంది. రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో రీన్యూ పవర్ సంస్థ ఎంఓయూలు కుదుర్చుకుంది.
ఈడీబీతో రూ.60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంఓయూలను రీన్యూ పవర్ సంస్థ ప్రతినిధులు కుదుర్చుకున్నారు. ఇవి కాకుండా గతంలోనే రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రీన్యూ పవర్ ముందుకు వచ్చింది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రీన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెడుతోంది. ఒప్పందంలో భాగంగా 6 జీడబ్ల్యూ పీవీ ఇంగోట్-వేఫర్ ప్లాంట్, 2 జీడబ్ల్యూ పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 కేటీపీఏ గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 జీడబ్ల్యూ హైబ్రిడ్ ప్రాజెక్టులను రీన్యూ పవర్ ఏర్పాటు చేయనుంది.
తాజా ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభించనుంది. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రీన్యూ పవర్ అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వంలో రాష్ట్రం వీడి వెళ్లిన కంపెనీలు తిరిగి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. లోకేష్ ట్వీట్ చేసిన ప్రకటనపై విశాఖలో ఈరోజు సీఐఐ సమ్మిట్‌కు ముందు రీన్యూ పవర్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది.
ఇవి కూడా చదవండి...
రెండు కీలక ఒప్పందాలు కుదర్చుకోనున్న సర్కార్.. చంద్రబాబు ట్వీట్
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా
Read Latest AP News And Telugu News