Nirmala Sitharaman GST 2.0: వాళ్ల గురించి బూతులొస్తున్నాయ్.. నిర్మల ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:01 PM
మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని.. మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 17: విశాఖ వి.కన్వెన్షన్‌లో నిర్వహించిన నెక్స్ట్ జెన్ జీఎస్టీ 2.0 అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ... యూపీఏ ప్రభుత్వం హయాంలో భిన్నమైన ట్యాక్సులుండేవని వాటిని సరిదిద్దలేదని విమర్శించారు. ట్యాక్స్‌లు కొన్ని సెక్షన్‌లకు మాత్రమే వర్తిస్తే జీఎస్టీ 140 కోట్ల ప్రజల మీద ప్రభావం చూపించేదన్నారు. జీఎస్టీ 2.0 అమలులోకి రాక ముందే ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తోందన్నారు. నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పనిచేస్తుందని కేంద్రమంత్రి వెల్లడించారు.
విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 12 శాతం స్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి వచ్చేస్తున్నాయన్నారు. జీఎస్టీ రాకముందు 17 రకాల పన్నులు, 8 రకాల సెజ్‌లు ఉండేవన్నారు. 2017లో 65 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉండగా ప్రస్తుతం 1.51 కోట్ల మంది జీఎస్టీ పరిధిలోకి వచ్చారని చెప్పారు. న్యూ జెన్ ట్యాక్స్‌లో స్లాబ్స్ తగ్గించడం వల్ల రూ.2 లక్షల కోట్ల వరకు ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. డెయిరీ ప్రొడెక్ట్స్‌పై 5 శాతం నుంచి సున్నా శాతానికి ట్యాక్స్ చేశామన్నారు. నిత్యావసరాల్లో 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వస్తున్నాయని అన్నారు.
మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్రమంత్రి వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని.. మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నా.. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా సరళీకృతం చేశామని స్పష్టం చేశారు. 45 రోజుల్లోపు బిల్లులు చెల్లింపుల కోసం అన్ని విభాగాలను ఆదేశిస్తూనే ఉన్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లకు జీఎస్టీ మినహాయింపులు ఇవ్వమని పార్లమెంట్‌లో అడగగలను కానీ.. ప్రజలకు అవసరమైన వ్యవహారాలపైనే దృష్టి సారించామన్నారు. ఎంఎస్ఎంఈలకు రావాల్సిన రీఫండ్ అమౌంట్ 90 శాతం వెంటనే వచ్చేస్తుందని.. 90 శాతం ఇంపోర్టెడ్ డ్యూటీ ఫండ్‌ను సరళీకృతం చేశామని తెలిపారు. 144 వందేభారత్‌లు, 60 శాతం కంటే ఎక్కువ హైవేలు, విమానాశ్రయాలు రెట్టింపు, సంక్షేమ పథకాలు, రక్షణ వ్యవస్థ బలోపేతం ఇవన్నీ జీఎస్టీ సొమ్ముతోనే చేశామని చెప్పుకొచ్చారు. మన డబ్బుని సరిగ్గా వినియోగించే ప్రభుత్వం మనకి కావాలన్నారు. డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్లు బోగస్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేశామన్నారు.
జీఎస్టీ 2.0 తీసుకొస్తే ఎనిమిదేళ్లు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసినట్లు ఒప్పుకుంటున్నారా? అని ప్రతిపక్షాలు మాట్లాడుతుండటం హాస్యాస్పదమని తెలిపారు. పదేళ్లు జీఎస్టీ తీసుకురాకుండా కాలయాపన చేసిన యూపీఏ ప్రభుత్వానికి జీఎస్టీపై మాట్లాడే అర్హత లేదన్నారు. వాళ్ల గురించి మాట్లాడాలంటే బూతులొస్తున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా బదులిచ్చేందుకు సమయం ఉందన్నారు. ప్రిడ్జ్, వాషింగ్ మెషీన్లపై యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం పన్ను ఉంటే ఇప్పుడు 18 శాతానికి వచ్చిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలి.. ప్రధానికి పవన్ బర్త్‌డే విషెస్
Read Latest AP News And Telugu News