AP Google agreement: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:39 AM
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది.
ఢిల్లీ: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు.
విశాఖలో రూ.87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది.
ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ.. గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ ఉండబోతుందని తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని పేర్కొన్నారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని స్పష్టం చేశారు. జెమినీ-ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లల్లో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని చెప్పారు. భారత దేశానికే కాదు.. విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి