Share News

ACB Court: వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:26 AM

మద్యం కుంభకోణంలో ఏ-34 నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ను ఫేస్‌ ఐడీ ద్వారా తెరిచేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.

ACB Court: వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

  • కసిరెడ్డి, చెవిరెడ్డి సహా ఏడుగురికి 16 వరకు రిమాండ్‌ పొడిగింపు

  • విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు

విజయవాడ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ-34 నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ను ఫేస్‌ ఐడీ ద్వారా తెరిచేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీనికి సంబంధించి సోమవారం న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో డబ్బుల కట్టలను లెక్కిస్తుండగా చిత్రీకరించిన వీడియోను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు. ఈ ఫోన్‌లో మరిన్ని ఆధారాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వాటిని బయటకు తీయడానికి వెంకటేష్‌ నాయుడి ఐఫోన్‌ను ఫేస్‌ ఐడీ ద్వారా తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్‌ కొద్దిరోజుల క్రితం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఏడుగురు నిందితులకు 16వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటే్‌షనాయుడు, బూనేటి చాణక్యతో పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీకుమార్‌ యాదవ్‌, నవీన్‌ కృష్ణను పోలీసులు సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. న్యూయార్క్‌ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని కస్టడీలోనే చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి న్యాయాధికారిని కోరారు.

Updated Date - Oct 14 , 2025 | 06:27 AM