Share News

Chandrababu On Bihar Election Results: బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం ఏమన్నారంటే..

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:08 PM

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్డీఏపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Chandrababu On Bihar Election Results: బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం ఏమన్నారంటే..
Chandrababu On Bihar Election Results

విశాఖపట్నం, నవంబర్ 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. ఈ క్రమంలో బిహార్‌లో ఎన్డీయే గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో సీఎం ప్రసంగిస్తూ బిహార్‌ ఫలితాలను ప్రస్తావించారు. బిహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ విజయం సాధించిందన్నారు. ఎన్డీయేపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత్‌లో ప్రధాని మోదీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని సీఎం వెల్లడించారు.


సీఎం ఇంకా మాట్లాడుతూ.. సౌదీ, రష్యా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, జపాన్, కెనడా తదితర దేశాల నుంచి డెలిగెట్స్ ఈ సదస్సుకు హాజరుకావటం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే చూడొద్దని.. నెట్వర్కింగ్ కోసం, మేధోపరమైన చర్చల కోసం, ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. పరస్పరం పెట్టుబడుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధించగలమని అంతా గుర్తించాలని అన్నారు. సింగపూర్ చాలా చిన్న దేశమైనా అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్గానిక్ ఉత్పత్తిగా అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని... ఆక్వా ఉత్పత్తులు, నేచురల్ ఫార్మింగ్‌లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు.


ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కొత్త టెక్నాలజీలు ఉంటే వారితో పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏపీలోని సుదీర్ఘ తీరప్రాంతం, గండికోట, అరకు లాంటి ప్రకృతి అందాలు పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూలమన్నారు. అలాగే కొత్తగా భారతీయ రుచులకు సంబంధించిన రంగాల్లోనూ విస్తృత అవకాశాలు వినియోగించుకోవచ్చని తెలిపారు. డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని చెప్పారు. సాంకేతికత సాయంతో అతి తక్కువ నష్టంతోనే ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదుర్కొంటున్నామన్నారు. నూతన ఆవిష్కరణలు, యువతకు నైపుణ్యాల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.


ఏపీలో 50 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ పరిశ్రమలకు, ప్రాజెక్టులకు అందుబాటులో ఉంచామన్నారు. మానవాళి సంక్షేమం కోసం అంతా కలిసి పనిచేద్దామని దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులకు, పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. ప్లీనరీ సదస్సుకు హాజరైన ఆర్మేనియా, సింగపూర్, మారిషస్, నేపాల్, అంగోలా, వెనిజులా దేశాలకు చెందిన మంత్రులు, యూఎన్ఓ ప్రతినిధులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

అవే కాంగ్రెస్‌ను గెలిపించాయ్.. జూబ్లీహిల్స్ ఫలితంపై మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపుపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 07:45 PM