Bihar Election Result: ఎన్నికల ఫలితాలపై పవన్ రియాక్షన్..
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:54 PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
అమరావతి, నవంబర్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువు అయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. శుక్రవారం నాడు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశ సమగ్రాభివృద్ధి, సుస్థిర పాలన సాధ్యమని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఈ విషయం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయంతో మరోసారి స్పష్టమైందని తెలిపారు. ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సాధించిన స్థానాలు మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి తార్కాణాలని అభివర్ణించారు. ఇంతటి విజయానికి కారకులైన నరేంద్ర మోడీకి పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
బిహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న నితీశ్ కుమార్ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. ఆ రాష్ట్రంలో విద్య, వైద్య ప్రమాణాలను మెరుగుపరచి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్లారని చెప్పారు. బిహార్‌లో ఈ విజయానికి కారకులైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, బిహార్ సీఎం నితీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.
మరోవైపు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు డిప్యూటీ సీఎం పవన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఏపీలో పెట్టుబడులకు రిలయెన్స్ గ్రీన్ సిగ్నల్
Chandrababu On Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం ఏమన్నారంటే..