Bayyavaram Incident: బయ్యవరం ఘటనపై చంద్రబాబు సీరియస్.. అలా చేయమంటూ ఎస్పీకి ఆదేశం..
ABN , Publish Date - Mar 19 , 2025 | 10:09 AM
మహిళ హత్య కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్‌ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి.. ఎస్పీకి ఫోన్ చేసి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు.

అమరావతి: అనకాపల్లి జిల్లా బయ్యవరం (Bayyavaram) వద్ద మహిళను ముక్కలుగా నరికిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్(SP Vakul Jindal)ను ఆదేశించారు. హత్య ఘటనపై మంగళవారమే స్పందించిన సీఎం చంద్రబాబు.. ఎస్పీ వకుల్ జిందాల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఇవాళ (బుధవారం) ఢిల్లీ పర్యటనలో ఆయన ఎస్పీకి మరోసారి ఫోన్ చేసి కేసు గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రికి వకుల్ జిందాల్ తెలిపారు. అయితే ఈ దారుణానికి పాల్పడిన వారికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఏపీలో చిన్నారులు, మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలు వంటి వాటికి రాష్ట్రంలో చోటు లేదన్నారు. ఎవరైనా దాడులకు తెగబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే..
కాగా, సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళను హత్య చేసిన దుండగులు ఆమె శరీర భాగాలను అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం వద్ద పడేశారు. జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద ఓ మూటను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కిడికి చేరుకున్న వారు దాన్ని పరిశీలించగా.. అందులో మహిళ కుడి చేయి, కాళ్లు, నడుము కింద భాగం గుర్తించి షాక్ అయ్యారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి సుమారు 40 సంవత్సరాలు ఉంటాయని, చేతికి బంగారు రంగు గాజులు, పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేసి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..