Y Satya kumar : ప్రభుత్వాసుపత్రిలో అక్రమాలు.. బాధ్యులపై చర్యలకు మంత్రి ఆదేశం
ABN , Publish Date - Jul 27 , 2025 | 09:50 PM
అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో గతంలో చోటు చేసుకున్న వ్యవహారంపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి.. నివేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందజేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అనకాపల్లి, జులై 27: అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో గతంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ నిర్ణయించారు. ఆ క్రమంలో 22 మంది వైద్యులు, నర్సులపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదివారం ఆదేశించారు. ఈ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏసీబీ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు జరిగినట్లు స్పష్టమైంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రి పరిగణలోకి తీసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
అనకాపల్లిలోని ఆసుపత్రిలో 2020, ఫిబ్రవరిలో ఇన్‌పేషెంట్లు, లెక్కలు, మందుల వినియోగాన్ని వైద్యులు, నర్సులు సరిగ్గా లెక్కులు చూపలేదు. ఆ సమయంలో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు.. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో గతంలో వచ్చిన ఆరోపణలు వాస్తవమని నిగ్గు తేల్చారు. అందుకు అనుగుణంగా నివేదికను తయారు చేసి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు అందజేశారు.
ఆ క్రమంలో డీసీహెచ్‌ఎస్‌తోపాటు తొమ్మిది మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులపై ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. దీంతో ఏసీబీ నివేదిక ఆధారంగా వైద్యులు, నర్సులు బదిలీపై ప్రస్తుతం ఏ ఏ స్థానాల్లో ఉన్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ఒక్కరూ రాజ్యాంగానికి అతీతులు కారు
చిటికెలో తిరుమల శ్రీవారి దర్శనం.. ఇదిగో ఇలాగా
For More Andhrapradesh News And Telugu News