Justice Lavu Nageswara Rao: ఏ ఒక్కరూ రాజ్యాంగానికి అతీతులు కారు
ABN , Publish Date - Jul 27 , 2025 | 09:27 PM
మన దేశంలో పార్లమెంట్‌కు విశేష అధికారాలున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు తెలిపారు. పార్లమెంట్ నిర్ణయాలను భారత సుప్రీంకోర్టు సైతం నియంత్రించ జాలదని స్పష్టం చేశారు. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీం అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అమరావతి, జులై 27: దేశంలో సుపరిపాలన అనేది చాలా ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ ఒక్కరూ రాజ్యాంగానికి అతీతులు కారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. ఆదివారం రాజధాని అమరావతిలో జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీ.. మూడేళ్లు కష్టపడి మన రాజ్యాంగాన్ని రూపొందించిందని గుర్తు చేశారు. మన దేశంలో ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అమల్లో ఉందన్నారు.
యూఎస్, భారత రాజ్యాంగాలను పరిశీలిస్తే ప్రెసిడెంట్, ప్రజా ప్రతినిధుల అధికారాలు విభిన్నంగా ఉంటాయని వివరించారు. మన దేశంలో పార్లమెంట్‌కు విశేష అధికారాలున్నాయని చెప్పారు. పార్లమెంట్ నిర్ణయాలను భారత సుప్రీంకోర్టు సైతం నియంత్రించ జాలదని స్పష్టం చేశారు. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీం అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యనిర్వాహక వ్యవస్థ చాలా జవాబుదారితనంతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధుల ఫిరాయింపులను భారత రాజ్యాంగం సమ్మతించదని పేర్కొన్నారు. గడచిన పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో శాసన సభాపతుల వ్యవహార శైలిని తాను పరిశీలిస్తున్నానని తెలిపారు. సభ్యుల అనర్హతపై స్పీకర్లు మూడు నెలలు లేదా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ స్పీకర్లు సభ్యుల అనర్హతపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకో లేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత అంశం బ్లాక్ షీప్ వ్యవస్థలాగా మారిందన్నారు.
ఎంతటి స్థాయి వారైనా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల జవాబు దారి తనంతో ఉండాలని జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలాగే న్యాయ వ్యవస్థ సైతం ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలన్నారు. అదే విధంగా న్యాయ వ్యవస్థ.. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సైతం కాపాడాల్సి ఉందన్నారు. వ్యవస్థంలో జవాబుదారీతనం పెంచడంలో సమాచార హక్కు చట్టం ఎంతో దోహాదపడుతుందన్నారు.
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణను ఎస్ఐఆర్ విధానంలో నిర్వహించారని చెప్పారు. ఎన్నో ఏళ్ల క్రితం ఇతర రాష్ట్రాల నుంచి బీహార్‌కు వచ్చిన వారు.. ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 65 లక్షల మంది ఓటర్లు.. జాబితాలో చోటు కోల్పోయారని వివరించారు. ఈ విషయంలో తాను ఎన్నికల కమిషన్‌ను క్రిటిసైజ్ చేయడం లేదని చెప్పారు. రాజ్యాంగంలోని 326 అధికరణ ప్రకారం ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముందన్నారు. 11 డాక్యుమెంట్లు ఆధారంగా ప్రతి పౌరుడు తమ నివాస ప్రాంతాన్ని, స్థానికతను దృవీకరించునే అవకాశం ఉందని చెప్పారు.
ఉన్నత శ్రేణి ప్రజలు వారి ఓటు హక్కు వినియోగించు కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు వినియోగించు కోవడాన్ని బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఓటు వేసి ఎన్నుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ తెచ్చిన నోటా నిష్ప్రయోజనంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో 45 శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్న వారేనని జస్టిస్ లావు నాగేశ్వరరావు పెదవి విరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై వైసీపీ పెద్దలు కన్నువేశారు.. మాజీ డీజీపీ షాకింగ్ కామెంట్స్
చిటికెలో తిరుమల శ్రీవారి దర్శనం.. ఇదిగో ఇలాగా
For More Andhrapradesh News And Telugu News