Share News

Jan Shatabdi Express : ప్రత్యేక రైలు ఖాళీగా..

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:02 AM

విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వేసిన జన సాధారణ్‌ ప్రత్యేక రైలు శుక్రవారం ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్లింది.

Jan Shatabdi Express : ప్రత్యేక రైలు ఖాళీగా..

విశాఖపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వేసిన జన సాధారణ్‌ ప్రత్యేక రైలు శుక్రవారం ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్లింది. ఉదయం 10 గంటలకు బయలుదేరిన ఈ రైలులో దాదాపుగా అన్ని కోచ్‌లూ ఖాళీగానే ఉన్నాయి. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్‌ సమీపాన చర్లపల్లిలో కొత్త టెర్మినల్‌ ప్రారంభించారు. దాంతో అక్కడి వరకు వెళ్లేలా కొన్ని రైళ్లను నడుపుతున్నారు. విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ఆవిధంగానే సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం జన సాధారణ్‌ రైళ్లు నడపనున్నట్టు ప్రకటించారు. వీటిలో ప్రయాణానికి టికెట్లు ముందుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టేషన్‌కు వెళ్లి కొనుక్కుంటే సరిపోతుంది. ఇందులో ఏసీ కోచ్‌లు, స్లీపర్‌ కోచ్‌లు, జనరల్‌ కోచ్‌లు కూడా ఉంటాయి. ఏయే ప్రాంతాల మధ్య ఏయే రైళ్లు ఏ సమయానికి నడుస్తాయో అధికారులు ముందుగానే ప్రచారం చేశారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియక రైళ్లను ఉపయోగించుకోలేకపోతున్నారు. విశాఖ-చర్లపల్లి రైలు విషయంలోనూ శుక్రవారం అదే జరిగిందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. రెగ్యులర్‌గా ఆయా మార్గాల్లో రైళ్లు నడిచే సమయానికే స్టేషన్‌కు రావడం వల్ల ఈ కొత్త రైలు విషయం తెలిసి ఉండకపోవచ్చని కూడా అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Updated Date - Jan 18 , 2025 | 05:02 AM