Land Scam: విశాఖ భూములపై రాజకీయ గద్దలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:36 AM
గతంలో వైసీపీలో పనిచేసి ఇటీవల టీడీపీలో చేరిన ఓ భూదళారీ ఊసరవెల్లిగా మారి విశాఖ, దాని చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను మింగేసిన కథ ఇది. రెవెన్యూ పెద్దల ఆశీస్సులతో ఇప్పటికే ఎండాడలోని మాజీ సైనికుల భూములను సెటిల్ చేసిన ఆ దళారీ నేత ఇప్పుడు మరికొన్ని భూములపై కన్నేశాడు.
రామానాయుడి స్టూడియో పక్కనున్న ఐదెకరాల డీ పట్టాపై సెటిల్‌మెంట్
భూమి విలువ రూ.82 కోట్లపైమాటే
వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుప్పిట్లో ఆ భూమి
ముందుగానే కాంపౌండ్‌వాల్ నిర్మాణం
ఆ ఫైలును ప్రాసెస్ చేస్తున్న అధికారులు
రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు
సౌభాగ్యరాయపురంలోని 38 ఎకరాలపై మార్చి మొదటి వారంలో ఒప్పందం
షెల్ కంపెనీల ద్వారా డబ్బు పంపిన నేత
ఆ తర్వాత అర్ధరాత్రి అడ్వాన్సులు
భూ దళారి అవతారమెత్తిన నేతకు పెద్దల ఆశీస్సులు
మాజీ సైనికులు, సామాన్యుల అసైన్డ్ భూములపై ఓ దళారీ కన్నేశాడు. హక్కుదారులను చీకటి భ్రమల్లో ఉంచి వారిని లేనిపోని భయభ్రాంతులకు గురిచేసి తాను తప్ప మరెవ్వరూ భూమిని కాపాడలేరని నమ్మించాడు. ఆ తర్వాత వారిని నట్టేట ముంచేశాడు. ఇదే దళారీ రాజకీయ నేత అవతారం కూడా ఎత్తాడు. పెద్దల ఆశీస్సులతో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రికి స్వాగతం పలికే ప్రొటోకాల్ జాబితాలో అగ్రపథాన ఉండడంతో అధికారయంత్రాంగం కూడా దాసోహమైంది. దీంతో భూములన్నీ సర్వం ఆయన గుప్పిట్లోకి వెళ్లిపోయాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గతంలో వైసీపీలో పనిచేసి ఇటీవల టీడీపీలో చేరిన ఓ భూదళారీ ఊసరవెల్లిగా మారి విశాఖ, దాని చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను మింగేసిన కథ ఇది. రెవెన్యూ పెద్దల ఆశీస్సులతో ఇప్పటికే ఎండాడలోని మాజీ సైనికుల భూములను సెటిల్ చేసిన ఆ దళారీ నేత ఇప్పుడు మరికొన్ని భూములపై కన్నేశాడు. వాటి విలువ తెలిస్తే మతిపోవాల్సిందే. కనీసం రూ.230 కోట్లపైమాటే మరి. పెద్దల ఆశీస్సులతో ఆయన చేపట్టిన భూ దందాలు ఇబ్బడిముబ్బడిగా వెలుగుచూస్తున్నాయి. అందులోదే రామానాయుడి స్టూడియో సమీపంలోని మరో ఐదు ఎకరాల డీ పట్టా భూమి.
నెల్లూరు వైసీపీ నేత హడావుడి
నెల్లూరుకు చెందిన ఓ వైసీపీ కీలక నేత విశాఖలోని చినగదిలి మండలంలో రామానాయుడి స్టూడియో పక్కనే ఐదు ఎకరాల విలువైన భూమిపై కన్నేశారు. అది ఒక మాజీ సైనికుడిది. ఆ భూమిని ఆయన నుంచి నేరుగా వైసీపీ నేత కొనుగోలు చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఆపని చేయలేదు. అది దొడ్డిదారిన దక్కించుకున్న భూమి. దీంతో కూటమి ప్రభుత్వంలో ఆ పని కాదనుకొని ప్రహరీ కట్టుకొని భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఆ భూమి విలువ రూ.82 కోట్లపైమాటే. ఇప్పుడు రెవెన్యూ పెద్దలు, అధికార యంత్రాంగంతో మాట్లాడి సెటిల్ చేయించే బాధ్యతను విశాఖకే చెందిన టీడీపీ నేతకు అప్పగించారు. ఈ నేత గత ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. అమరావతిలో డీలింగ్స్ ఎండాడ భూమి సెటిల్‌మెంట్‌తో సక్సె్‌సపుల్ దళారీగా ఆయన మారారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఈయన, ఆ వైసీపీ నెల్లూరు నేత ఇద్దరూ సన్నిహితులు. దీంతో ఈ భూమిని నిషేధ జాబితా నుంచి తీసేయించి, కలెక్టర్‌తో ఎన్‌ఓసీ ఇప్పించే బాధ్యతను తీసుకున్నారు. ఇందులో పెద్దలను భాగస్వాములను చేయడంతో భూమి ఫైలు అమరావతిలోని నాలుగో బ్లాక్‌కు చేరింది. ఈ భూమిపై రెండుసార్లు అమరావతి సచివాలయం కేంద్రంగా సమావేశాలు జరిగాయి. తాడేపల్లిలోని ఓ మూడు అక్షరాల హోటల్‌లో రెండు సమావేశాలు జరిగాయి. ఈ భేటీలకు నెల్లూరుకు చెందిన వైసీపీ కీలక నేత, ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా హాజరయ్యారు. త్వరలో దీనికి మోక్షం కల్పించబోతున్నారు. దీనికి టీడీపీలో ఉన్న ఓ దళారీ నేత ప్రయత్నాలు కొనసాగిస్తుండం విశేషం. ఆ నేత వైసీపీని వదిలి టీడీపీలో చేరినా ఆయన కష్టం అంతా వైసీపీ నేతల కోసమే అన్నట్లుగా సెటిల్‌మెంట్‌లు చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇదే భూమి తనకు కావాలని భీమిలి ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పేచీ పెట్టారు. తనకు ఆ భూమి దక్కకపోతే అందరి బండారం బయటపెడతానని కూడా ఆయన హెచ్చరించినట్టు తెలిసింది.
రూ. కోట్ల భూమికి రూ.లక్షల్లో చెల్లింపులు
రైతులు, మాజీ సైనికులకు డబ్బులు ఇచ్చి వారి భూముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే తప్పేముంది? అదేమి చట్టవ్యతిరేకమైన చర్యకాదు కదా అని కొందరు పెద్దలు వాదించొచ్చు. అయితే, భూమి హక్కుదారులకు ఎంత సొమ్ము చెల్లిస్తున్నారు? అది నైతికంగా సరైన చెల్లింపా? లేక రైతులను మోసం చేసి కొనుగోలు చేస్తున్నారా? అనేది పలు చట్టాల పరిధిలోకి వచ్చే అంశాలు. తమ వల్లనే ఎన్‌ఓసీ వస్తుందని నమ్మించి ఎకరా రూ.20 లక్షలకు ఓ మాజీ సైనికుడికి కట్టబెట్టారు. ఇది మోసం, దగా. చట్టరీత్యా నేరం. అక్కడ భూమి మార్కెట్ విలువే ఎకరాకు కనీసం రూ.15-20 కోట్లపైమాట. అలాంటి చోట ఎకరాకు 20లక్షల మేర మాజీ సైనికుడికి చెల్లించారు. ఇక సామాన్య రైతులకు ఎకరాకు 10-15 లక్షలే ఇచ్చారు. ఇలా రైతులను మోసం చేసి భూములపై ఒప్పందాలు చేసుకోవడం, షెల్ కంపెనీల నుంచి డబ్బులు బదలాయించడం చట్టారీత్యానేరం. ఇలాంటి పనులు చేసేవారిని వెనుకేసుకొచ్చి వారికి తెరవెనుక సహకరించడం కూడా నేరమే.
ఎవరి అండతో ఈ దందా?
ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం అమల్లో ఉంది. ఆ నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో మంత్రివర్గ ఉపసంఘానికి, ఇంకా ప్రభుత్వాధినేతకు తప్ప మరెవ్వరికీ తెలియని అంశం. అలాంటిది ఏ ధైర్యంతో గత మార్చి నుంచే ఈ దళారీ నేత డీ పట్టా భూములపై ఒప్పందాలు చేసుకున్నారు? ఎవరి ప్రోద్బలం, అండతో రైతులకు అడ్వాన్స్‌లు ఇచ్చారు? ఎవరిచ్చిన ధైర్యంతో ఆ దళారీ మాజీ సైనికులు, సామాన్య రైతులకు కుచ్చుటోపీ పెట్టి రూ.కోట్ల విలువైన భూ ములను రూ.లక్షలకే దక్కించుకున్నారు. తెరవెనక పెద్దల అండాదండ లేకుండా కేవలం ఓ నియోజకవర్గ స్థాయి నేత ఇలాంటి పనులు చేయగలరా?మాజీ సైనికుల భూములను నిషేధ జాబితా నుంచి తొలగించడానికి ఎలాంటి ఎన్‌ఓసీ అవసరం లేదనే 2016లోనే ప్రభుత్వం 279 జీఓ ఇచ్చింది. అయినా సరే ఎన్‌ఓసీ ఉండాల్సిందేనని చెబుతున్న అధికారుల మాటల వెనక ఎవరి చర్యలు దాగి ఉన్నాయి?
ఆ భూములపై చీకటి ఒప్పందాలు
ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో సౌభాగ్యరాయపురం (ఎస్‌ఆర్ పురం) అనే గ్రామంలో మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, పేద ప్రజలకిచ్చిన అసైన్డ్ భూములు వందలాది ఎకరాలున్నాయి. జగన్ జమానాలో ప్రభుత్వంలో ఓ ఐఏఎస్ కొడుకు, అల్లుడితో కలిసి విశాఖకే చెందిన దళారీ నేత భారీగా భూములు కొన్నారు. అందులో అసైన్డ్ భూములున్నా యి. జగన్ పాలన చరమాంకంలో రైతులతో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్లు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది ఆగస్టు నుంచే ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై నిషేధం విధించారు. అయితే, పెద్దల ఆశీస్సులతో భూ దళారీ ఎస్‌ఆర్ పురంలోని డీ పట్టా భూములను చేజిక్కించుకునే పనులు ప్రారంభించారు. ఒక మాజీ సైనికుడి వద్ద ఉన్న ఐదు ఎకరాలతోపాటు, ఇతర రైతుల వద్ద 31 ఎకరాలను గుప్పెట పట్టారు. ఎకరా రూ.20 లక్షలకు ఈ భూ దళారీ సూచించిన వ్యక్తులు, ఓ షెల్ కంపెనీలోని డైరెక్టర్ల పేరిట ఈ ఏడాది మార్చిలో ఒప్పందాలు జరిగా యి. అడ్వాన్స్‌లు షెల్ కంపెనీల నుంచి బదిలీ చేశారు. ఇక్కడి నుంచి డ్రాచేసి ఓ అర్ధరాత్రి పంపిణీ చేశారు.
ఆ అధికారి ఎవరు?
ప్రభుత్వంలో ఓ ముఖ్య వ్యక్తి వద్ద పనిచేస్తున్న ఓ ముఖ్య అధికారి ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే ఎన్‌ఓసీ డ్రామాను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. ఈ విషయం ఆ ముఖ్యనేతకు తెలియకుండా ముఖ్య అధికారి తెర వెనుక నడిపిస్తున్నారని ఉన్నతాధికారవర్గాలే చెబుతున్నాయి. అయినా, చర్యలు లేకపోవడం చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు ఈ ముఖ్య అధికారికి రెవెన్యూలోని వారు తోడవ్వడంతో మాజీ సైనికులు, సామాన్య రైతులే బలవుతుండటం ఇందులోని విషాదం.