Share News

CM Chadrababu: వికసిత భారతాన.. స్వర్ణాంధ్ర సాధన

ABN , Publish Date - May 25 , 2025 | 03:58 AM

వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం 2047కు దృష్టి పెట్టింది. పీ-4 అమలు, డిజిటల్ పాలన, పారిశ్రామిక అభివృద్ధితో పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించాయి.

CM Chadrababu: వికసిత భారతాన.. స్వర్ణాంధ్ర సాధన

  • కలిసికట్టుగా సాధిద్దాం

  • 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ

  • పీ-4 అమలుతో ఆ లక్ష్యాన్ని అందుకుంటాం

  • అమరావతి, తిరుపతి, కర్నూలుకు విశాఖ మోడల్‌!

  • టెక్నాలజీ అభివృద్ధికి శీఘ్రగతిన ప్రణాళికలు

  • డిజిటల్‌ మౌలిక కల్పనల్లో ఆదర్శంగా నిలిచాం

  • కుటుంబానికో పారిశ్రామికవేత్త.. మా నినాదం

  • 2047నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

  • నీతీ ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు వెల్లడి

  • సీఎం బ్లూప్రింట్‌ ప్రజంటేషన్‌కు మోదీ ప్రశంస

న్యూఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకునేనాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాలకు అనుగుణంగా నడిచేందుకు... ఇందులో దేశానికే మార్గదర్శకంగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘స్వర్ణాంధ్ర విజన్‌ 2047’ ద్వారా ఆవిష్కరణలు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్థి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి ఏపీ దోహద పడుతుందని తెలిపారు. ‘వికసిత్‌ భారత్‌ 2047’ సాకార పథంలో ఆంధ్రప్రదేశ్‌ ముందుందని పేర్కొన్నారు. 2.4 ట్రిలియన్‌ డాలర్ల ప్రగతి లక్ష్యంతో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పీ 4 ద్వారా ఈ లక్ష్యాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ‘భారత మండపం’లో శనివారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతీ ఆయోగ్‌ 10వ పాలక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై నివేదిక సమర్పించారు. వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండు, మూడో శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. డిజిటల్‌ గవర్నెన్స్‌లో గూగుల్‌ ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్‌ డిజిటల్‌ పాస్‌బుక్‌ సృష్టిస్తున్నామని చంద్రబాబు వివరించారు. టాటా ఇన్నొవేషన్‌ హబ్‌, ఏఐ ఆధారిత పాలన ద్వారా ఏపీ స్టార్ట్‌పలకు, ఉద్యోగ సృష్టికి మార్గదర్శకంగా మారిందని తెలిపారు. సర్క్యులర్‌ ఎకానమీ, అభివృద్ధి వికేంద్రీకరణ, మిషన్‌ కర్మయోగి వంటి కార్యక్రమాల ద్వారా సమగ్రాభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తోందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో పదో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుందని, త్వరలోనే మూడో స్థానానికి వెళ్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తంచేశారు. డిజిటల్‌ ఇండియా, జీఎ్‌సటీ, స్టార్టప్‌ ఇండియా, పీఎం గతిశక్తి, జల్‌జీవన్‌ మిషన్‌ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని ఏపీ ప్రభుత్వం డిజిటల్‌గా ట్రాక్‌ చేస్తోందన్నారు. ‘వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఆంత్రప్రెన్యూర్‌’ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎ్ సఎంఈ పార్కులు, వన్‌ డిస్ట్రిక్ట్‌- వన్‌ పార్క్‌ను ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు వివరించారు.


‘ఆపరేషన్‌ సిందూర్‌’ మోదీ ఘనతే..

పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నీతీ ఆయోగ్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతోనే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతమైందని కొనియాడారు. యుద్థ వాతావరణం నెలకొన్న సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ ధైర్యంగా నాయకత్వం వహించారని సీఎం ప్రశంసించారు.

బాబు బ్లూ ప్రింట్‌పై పీఎం ప్రశంసలు

నీతీ ఆయోగ్‌ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను బ్లూ ప్రింట్‌ (ప్రణాళిక) ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని సూచించారు. చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని మోదీ కొనియాడారు.

ఇవే మూడు మంత్రదండాలు

జీడీపీ, జనాభా నిర్వహణ, టెక్నాలజీపై దృష్టి

వాటి సాధనకు మూడు సబ్‌గ్రూ్‌పలు

రాష్ట్రాలు, కేంద్రం, నీతీ ఆయోగ్‌తో ఏర్పాటు

సమావేశంలో ప్రతిపాదించిన చంద్రబాబు

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని వేగవంతంగా సాధించేందుకు జీడీపీ, జనాభా నిర్వహణ, టెక్నాలజీపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికోసం మూడు సబ్‌ గ్రూప్‌లను రాష్ట్రాలతో ఏర్పాటు చేయాలని నీతీ ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. కేంద్రప్రభుత్వం, నీతీ ఆయోగ్‌, రాష్ట్రప్రభుత్వాలు ఈ సబ్‌ గ్రూప్‌లో కలిసి పని చేయాలని ఆయన సూచించారు. మొదటి సబ్‌గ్రూప్‌ జీడీపీ అభివృద్ధిని పెంచేందుకు, రెండవ సబ్‌గ్రూప్‌ జనాభా నిర్వహణకు, మూడో సబ్‌గ్రూప్‌ టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

మొదటి సబ్‌గ్రూప్‌ : పెట్టుబడులు, ఉత్పత్తి, ఎగుమతులు, పెంపొందించేందుకు, ఉపాధి కల్పన అవకశాలు కల్పించేందుకు పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం వయబులిటీ గ్యాప్‌ నిధులను సమకూర్చేందుకు పని చేయాలి.

రెండో సబ్‌గ్రూప్‌: వృద్ధాప్యం, తక్కువ సంతాన సాఫల్యం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధమయ్యేందుకు తోడ్పాడాలి. దేశంలోని జనాభాను సదావకాశంగా భావించాలి.

మూడో సబ్‌గ్రూప్‌ : ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, డ్రోన్లు, రియల్‌టైమ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు, పౌరుల కేంద్రీకృత పాలనపై దృష్టి సారించాలి.

Updated Date - May 25 , 2025 | 04:00 AM