Kurnool Bus Accident: బస్సు ప్రమాదం.. వెలుగులోకి మరో వీడియో..
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:04 AM
కర్నూలు శివారులో గత నెల 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కర్నూలు క్రైం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు శివారులో గత నెల 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన సమయంకంటే ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు డాస్కమ్‌లో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ యాక్సిడెంట్ తర్వాత శివశంకర్ కింద పడి మృతి చెందగా.. ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడి తానే శివశంకర్‌ను పక్కకు లాగాననీ పోలీసులకు చెప్పుకొచ్చాడు. దీనిపై గత కొద్ది కాలంగా అస్ఫష్టత నెలకొని ఉండేది. తాజాగా వైరల్ అయిన వీడియోతో బైక్ ప్రమాదం ముందే జరిగిందని ఎర్రిస్వామి చెప్పిన మాట నిజమేనని తెలిపాయి.
ఈ ప్రమాదంలో బైక్ కుడి పక్కకు పడిపోగా.. మృతి చెందిన శివశంకర్‌ను ఎడమవైపునకు లాగిన దృశ్యాలు ఉన్నాయి. కొన్ని బస్సులు ఆ బైక్‌ను తప్పించుకుని వెళ్లిన వీడియోల దృశ్యాలు వీడియోలో కనిపించాయి. కానీ కావేరి ట్రావెల్స్ బస్సు మాత్రం ఆ బస్సును తప్పించలేకపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో పాటు సమీపంలోని ఓ డాబాలో ఉన్న సీసీ ఫుటేజీ కూడా విడుదలైంది. ఇందులో వి.కావేరీ బస్సు ముందుకు రావడం, అందులో నుంచి క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటం స్పష్టంగా కనిపించాయి. సరిగ్గా రాత్రి 2:44 గంటలకు మంటలు వ్యాపించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అంతకుముందు రాత్రి 2:25 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరగడం, ఆ సమయంలోనే శివ మృతదేహాన్ని స్నేహితుడు ఎర్రిస్వామి రోడ్డుపక్కకు లాక్కొని రావడం వీడియోల్లో కనపడుతోంది.
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు దృశ్యాలివే..