Share News

Vallabhaneni Vamsi : మట్టికొట్టుకు పోతారు

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:24 AM

గురువారం రాత్రి వంశీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు.

Vallabhaneni Vamsi : మట్టికొట్టుకు పోతారు

  • న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటి దురుసు

  • తనపై కేసు పెట్టిన, పెట్టించిన వారికి శాపనార్థాలు

  • వాదనలు వాయిదా వేసిన కాసేపటికి రిమాండ్‌ విధింపు

విజయవాడ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): తనపై కేసు పెట్టినవారు, పెట్టించిన వారి కుటుంబాలు మట్టికొట్టుకుని పోతాయని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాపనార్థాలు పెట్టారు. వాదనల అనంతరం న్యాయాధికారి చాంబర్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన వింటుండగానే తన నోటి దురుసును ప్రదర్శించారు. గురువారం రాత్రి వంశీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి రామ్మోహన్‌ చాంబర్‌లోకి వంశీని పిలిచిన తర్వాత తాము చెప్పుకోవాల్సింది ఉందని ఆయన తరపున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, తానేటి చిరంజీవి కోరారు. దీంతో న్యాయాధికారి వాదనలకు అనుమతించారు. వంశీపై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ చెల్లదని, తనను కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో ఎక్కడా రాయలేదని వాదించారు. దీంతో ‘అసలు మీరు ఫిర్యాదును చదివారా? లేదా?’ అని న్యాయాధికారి సూటిగా ప్రశ్నించారు. ఫిర్యాదులో ఏముందో చదవాలని వారికి సూచించారు. ఈ కేసులో ముదునూరి సత్యవర్ధన్‌ ఇప్పటికే న్యాయాధికారి ముందు 161 వాంగ్మూలం ఇచ్చాడని, అతడిని బాధితుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పొన్నవోలు పదేపదే ఇదే అంశంపై వాదిస్తుండటంతో న్యాయాధికారి స్పందించారు. 161 గురించి చాలాసార్లు చెప్పారని, కొత్త అంశం ఏమైనా ఉంటే దాని గురించి వాదించాలని సూచించారు.


న్యాయాధికారి అసహనం

గురువారం రాత్రి 10 గంటలకు వంశీని కోర్టుకు తీసుకొస్తామని పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆ సమయానికి న్యాయాధికారి చాంబర్‌కు చేరుకున్నారు. గంట దాటినా పోలీసులు రికార్డును తీసుకురాకపోవడంతో న్యాయాధికారి అసహనం వ్యక్తం చేశారు. రెండుసార్లు చాంబర్‌ నుంచి బయటకు వచ్చి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పుకున్నారు. గంట తర్వాత రికార్డులు కోర్టుకు వచ్చాయి. వాదనలు మొత్తం కోర్టు హాలులో జరుగుతాయని భావించారు. కానీ న్యాయాధికారి మాత్రం చాంబర్‌లోనే వాదనలు వింటానని చెప్పారు. వంశీ తరపున మాజీ ఏజీ పొన్నవోలు, తానేటి చిరంజీవి, పోలీసు శాఖ తరపున సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేంద్రప్రసాద్‌, సమీర, కల్యాణి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా వాదనలు జరుగుతుండగా నిందితుడ్ని శుక్రవారం కోర్టులో హాజరుపరచాలని న్యాయాధికారి ప్రకటించారు. దీంతో చాంబర్‌లో ఉన్న న్యాయవాదులు బయటకు వచ్చేశారు. చాంబర్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో వంశీ నోటి దురుసును ప్రదర్శించారు. తనపై కేసు పెట్టినవారు, పెట్టించినవారి కుటుంబాలు మట్టికొట్టుకుని పోతాయని శాపనార్థాలు పెట్టారు. ఈ మాటలు చాంబర్‌లో ఉన్న న్యాయాధికారి విన్నారు. తర్వాత కాసేపటికి పోలీసులను, న్యాయవాదులను లోపలకు పిలిచి తీర్పు వెలువరిస్తానని, వేచి ఉండాలని చెప్పారు. వాదనలు వాయిదా వేసిన కాసేపటికే న్యాయాధికారి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. వంశీకి రిమాండ్‌ విధించినట్టు అర్ధరాత్రి 2.30 గంటల తర్వాత న్యాయాధికారి ప్రకటించారు. అయితే వంశీని ఏ జైలుకు తరలిస్తారన్న దానిపై కొంతసేపు సందిగ్ధత ఏర్పడింది. కొద్దినెలల క్రితం కారాగారాల పరిధిలో మార్పులు వచ్చాయి. విజయవాడ కోర్టుల్లో రిమాండ్‌ విధించిన నిందితులను నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీని కూడా నెల్లూరు జైలుకు తరలిస్తారని భావించారు. అయితే ఆయనను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించాలని న్యాయాధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జైలుకు తరలించడానికి ముందు సూర్యరావుపేట పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఉన్న సీడీఐసీ (సెంట్రల్‌ డిటెక్షన్‌ ఇంటరాగేషన్‌ సెల్‌)లో వంశీ వేలిముద్రలు, ఐరిష్‌తో పాటు ఫొటోలు తీశారు.


వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వండి

ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసుల పిటిషన్‌

వల్లభనేని వంశీని పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పటమట పోలీసులు శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్థన్‌ను కిడ్నాప్‌ చేసి, బెదిరించి కేసు నుంచి తప్పుకునేలా చేశారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరారు. అలాగే సాంకేతిక ఆధారాల పరిశీలన కోసం వంశీ ఉపయోగించిన ఫోన్లను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా కృష్ణాజిల్లా ఉంగుటూరు, హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతాల్లో వంశీ చేసిన అక్రమాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వాటిలో విచారించేందుకు గాను అక్కడి పోలీసులు రెండు, మూడు రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేస్తారని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 03:24 AM