Share News

Youth Skill Boost: నిరుద్యోగ యువతకు యునిసెఫ్‌ శిక్షణ

ABN , Publish Date - May 01 , 2025 | 05:08 AM

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యునిసెఫ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ‘వైఎఫ్‌ఎస్‌ఐ’, ‘యూత్‌ హబ్’, ‘పీ2ఈ’ కార్యక్రమాలతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు

Youth Skill Boost: నిరుద్యోగ యువతకు యునిసెఫ్‌ శిక్షణ

  • యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

  • ఇంటికో పారిశ్రామికవేత్త, స్వర్ణాంధ్రకు తోడ్పాటు

  • మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఒప్పందం

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధితోపాటు సాధికారత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు యునిసె్‌ఫతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర మానవవనరులశాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో జరిగిన ఈ కీలక ఒప్పంద పత్రాలపై రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు,యునిసెఫ్‌ యువాహ్‌ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, యునిసెఫ్‌ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యునిసెఫ్‌, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలు పరస్పర సహకారంతో యూత్‌ ఫర్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ (వైఎఫ్‌ఎస్‌ఐ), యూత్‌ హబ్‌, పాస్‌పోర్ట్‌ టు ఎర్నింగ్‌ (పీ2ఈ) కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఇవి ఇంటికో పారిశ్రామికవేత్త, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు తోడ్పడటంతో పాటు నవీన ఆవిష్కరణలు, సమ్మిళిత, స్థిరజీవనోపాధి అవకాశాలను పెంపొందిస్తాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్‌, ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఎండీ, సీఈవో జి.గణేష్ కుమార్‌, ఏపీఎస్ఎస్ డీసీ ఈడీ కె.దినేష్ కుమార్‌, యునిసెఫ్‌ ప్రతినిధులు జిలాలిమ్‌ బిర్హాను టఫెస్సే, మురళీకృష్ణ మదమంచి, మానస ప్రియా వాసుదేవన్‌, వంశీకృష్ణ, స్టాక్‌ హోల్మ్‌ డిజిటల్‌, ఏఐ, స్ట్రాటజీ, ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ కన్సల్టెంట్‌ రవితేజ బాలే తదితరులు పాల్గొన్నారు.


ఇవీ కార్యక్రమాలు

  • వైఎఫ్‌ఎస్‌ఐప్రోగ్రాం ద్వారా పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ అభ్యసించే 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను అందించడంతో పాటు ఉద్యోగాల కల్పన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు యునిసెఫ్‌ గ్లోబల్‌ అప్‌షిఫ్ట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.

  • యూత్‌ హబ్‌ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య పోర్టల్‌తో అనుసంధానించిన బహుభాషా డిజిటల్‌ వేదిక ద్వారా యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, వాలంటీర్‌షిప్‌ అవకాశాలను కల్పించనున్నారు.

  • పాస్‌పోర్ట్‌ టు ఎర్నింగ్‌తో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్‌, ప్రొఫెషనల్‌ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:08 AM