Inquiry Commission : తొక్కిసలాటపై న్యాయ విచారణ ప్రారంభం
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:08 AM
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా గత నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి
తిరుపతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా గత నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభమైంది. విచారణ కమిషన్‌గా నియమితులైన ఏపీ హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి శనివారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి అందిన నివేదికలను పరిశీలించారు. ఆపై విచారణకు పిలవాల్సిన అధికారులు, ఉద్యోగులు, ఇతర వ్యక్తులకు నోటీసులు సిద్ధం చేయించారు. సాయంత్రం తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడ పద్మావతి పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన గేటును, పక్కనే ఉన్న చిన్న గేటును పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి అతిధి గృహానికి చేరుకున్నారు. కాగా, తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ప్రారంభం కావడంతో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు, ఘటన జరిగిన రోజు సంబంధిత ప్రదేశంలో విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.
శ్రీవారి సేవలో జస్టిస్ సత్యనారాయణమూర్తి
తిరుపతి తొక్కిసలాట ఘటన ఎంక్వైరీ కమిషన్ హెడ్, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News