Tirumala : ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:55 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి.
తిరుమల, జనవరి 19(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. పదిరోజుల పాటు దా దాపు 6.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకుని.. ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను తెరిచిన విషయం తెలిసిందే. గతేడాది తరహాలోనే పదిరోజుల పాటు (19వ తేదీ వరకు) వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించిన టీటీడీ ఆన్‌లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణిటికెట్లను జారీ చేసింది. ఇక, ఆఫ్‌లైన్‌లో తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లను జారీ చేసింది. ఇక, చివరిరోజు ఆదివారం దాదాపు 71వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి ఏకాంతసేవతో వైకుంఠ ద్వారాలను మూసివేశారు. సోమవారం వేకువజాము సుప్రభాతసేవ నుంచి యధావిధిగా సాధారణ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. వైకుంఠద్వార దర్శనాలు ముగిసిన క్రమంలో ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.