Papavinashanam Dam : టీటీడీ జలాశయాల భద్రతపై దృష్టి
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:42 AM
భక్తుల దాహార్తిని తీర్చే టీటీడీ జలాశయాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా లీకేజీలు, పగుళ్లు, తుప్పుపట్టిన...
లీకేజీలు, పగుళ్లు, తుప్పుపట్టిన గేట్లు
డ్యామ్‌ల మరమ్మతులకు అధికారుల చర్యలు
కేంద్ర జలసంఘం సహకారం కోరిన టీటీడీ
తిరుమల, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చే టీటీడీ జలాశయాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా లీకేజీలు, పగుళ్లు, తుప్పుపట్టిన గేట్లతో డ్యాముల పరిస్థితి ఆందోళన రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చిన అధికారులు డ్యాముల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించారు. డ్యాముల నిర్వహణలో పూర్తి పరిజ్ఞానం ఉన్న అధికారులు టీటీడీలో లేకపోవడంతో వాటి మరమ్మతుల కోసం కేంద్ర జల సంఘాన్ని టీటీడీ సంప్రదించింది. భక్తులకు నీటి అవసరాలను తీర్చేందుకు తిరుమలలో మొత్తం ఐదు డ్యాములున్నాయి. 1960 వరకు చిన్నపాటి చెరువులు, గుంతలపై ఆధారపడే టీటీడీ తొలిసారిగా 1963లో గోగర్భం డ్యామును, 1983లో పాపవినాశనం డ్యామును నిర్మించింది. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ.. నీటి కొరత ఏర్పడుతున్న క్రమంలో 2002లో ఆకాశగంగ, 2011లో జంట ప్రాజెక్టులుగా పిలిచే కుమారధార, పసుపుధార డ్యాములను నిర్మించారు. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 0.05407 టీఎంసీ (14,303 లక్షల గ్యాలన్లు)లు అయితే గోగర్భం డ్యాము నిర్మించి 62 ఏళ్లు, పాపవినాశనం నిర్మించి 42 ఏళ్లు, ఆకాశగంగ డ్యాం నిర్మించి దాదాపు 23 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వాటిని సమర్థంగా నిర్వహించేందుకు అనుభవం కలిగిన నీటి పారుదల శాఖ సహకారం తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ కోరిన మేరకు కేంద్ర జలసంఘం డ్యాం భద్రత విభాగం డైరెక్టర్‌తో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు తిరుమలలోని జలాశయాలను కొద్ది నెలల క్రితం గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం డ్యాముల్లో లీకేజీలతో పాటు పాడైన గేట్లను పరిశీలించారు. వాటి స్థానంలో నూతన గేట్లు, పటిష్టమైన ఆనకట్ట ఏర్పాటు చేయాలని ఈ బృందం టీటీడీకి ఇప్పటికే నివేదిక సమర్పించింది. ఇక.. కుమారధార, పసుపుధార డ్యాముల్లోనూ టెక్నాలజీకి సంబంధించి పలు యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
తిరుమలలో కార్యాలయం
డ్యాముల మరమ్మతుల కోసం టీటీడీనే నిధులు కేటాయించనుంది. ఈ క్రమంలో కేంద్ర జలసంఘం సూచనలతో రాష్ట్ర జలవనరుల శాఖ నుంచి మెకానికల్ విభాగానికి చెందిన ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో పాటు ముగ్గురు ఏఈలు, సివిల్ విభాగానికి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మరో ముగ్గురు ఏఈలు చొప్పున మొత్తం 8 మంది అధికారులు తిరుమలకు రానున్నారు. వీరి కోసం ఇప్పటికే తిరుమలలోని సీఆర్వో భవనంలో రెండు కార్యాలయాలు కేటాయించారు. త్వరలో వీరు డ్యాములపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి మరమ్మతులు, నూతన యంత్రాల ఏర్పాటు పనులు ప్రారంభించనున్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు పూర్తయ్యేవరకు ఈ అధికారుల బృందం తిరుమలలోనే ఉంటుంది.