Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 24 , 2025 | 09:20 PM
తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, తనయుడు నారా లోకేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ జరిగిన..
తిరుమల, సెప్టెంబర్ 24: తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ(బుధవారం) జరిగిన పెద్ద శేషవాహనసేవలో చంద్రబాబు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. రాత్రి 7.30 గంటలకు సతీమణి భువనేశ్వరితో కలిసి బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. గాయత్రి నిలయం దగ్గర టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సీఎంకు స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా, బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలి రోజున జరిగే ఉత్సవం ద్వజారోహణం. ఈరోజు ఉదయం స్వామివారికి సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పించారు. స్వామివారి వాహనం గరుడుడు కావున, ఒక కొత్త వస్త్రం మీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీనిని 'గరుడధ్వజ పటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు.
గరుడ ధ్వజ పటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టే..
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News