Prasanna Kumar Reddy Comments: ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం..
ABN , Publish Date - Jul 08 , 2025 | 09:43 PM
Prasanna Kumar Reddy Comments: టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అంటేనే బూతుకు కేరాఫ్ అని.. అలాంటి పార్టీలో ఇలాంటి నేతలే ఉంటారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
అధికారంలో ఉండగా నోటిదూలతో కారు కూతలు కూయడమే కాకుండా మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వైసీపీ నేతలకు ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టిన ఇంకా దూలమాత్రం తగ్గలేదు. తాజాగా వైసీపీ నెల్లూరు నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి. ఆయనపై కేసులు కూడా నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్లు ఉపందుకున్నాయి. మహిళా సంఘాలు రొడ్డెక్కాయి.
మరోవైపు ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రసన్నకుమార్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత.. ఓ మహిళా శాసన సభ్యురాలు గురించి నీచంగా మాట్లాడిన వైసిపి శాసనసభ్యుడు ప్రసన్నకుమార్ రెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి నేతల గురించి మాట్లాడటం సిగ్గుగా ఉందన్నారు. మహిళ నేతలు రాజకీయాల్లోకి రావాలంటే హడలెత్తిపోయేలా జగన్ రెడ్డి వేసిన బూతు బీజాలు విష సంస్కృతిగా విస్తరించేయని హోంమంత్రి తప్పు పట్టారు. ప్రసన్నకుమారు రెడ్డి మాట్లాడిన వీడియోని వారి తల్లికి, భార్యకు, బిడ్డ దగ్గరకు వెళ్ళి చూపిస్తే ప్రసన్నకుమార్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి మహిళలను పిశాచాలు, సంకర జాతి అని ఎంత తప్పుగా మాట్లాడారో, ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అంతకంటే నీచంగా వ్యవహరించారని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
వర్ల రామయ్య కామెంట్స్..
ప్రసన్నకుమార్ రెడ్డి మాటలపై పోలీసులు వెంటనే కేసు రిజిస్ట్రర్ చేయాలని, మహిళల గౌరవాన్ని అగౌరవ పరచిన ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి వెంటనే జుడిషియల్ కష్టడీకి పంపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. జగన్ రెడ్డికి నైతిక విలువలున్నా.. మహిళల పట్ల గౌవరం ఉంటే..? వెంటనే ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుండి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతల తీరు యథారాజా తథా ప్రజా అన్నట్లు ఉందని.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని వర్ల రామయ్య అన్నారు. జగన్ రెడ్డిలానే.. ఆయన అనచరులు కూడా నడుస్తున్నారని, గతంలో జగన్ రెడ్డి తన చెల్లి కట్టుకున్న చీరపై కామెంట్ చేశాడని అన్నారు. నిన్న ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు భారతీయ సంస్కృతి, భారతీయ కుటుంబ వ్యవస్థపై దాడి చేసినట్లని ఆయన మండిపడ్డారు. నేడు ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతిరెడ్డిని Phdలంటూ మాట్లాడటం ఎంత దుర్మార్గమని అన్నారు. ఇదే తెలుగుదేశంలో మాట్లాడితే.. మా అధినేత చంద్రబాబు నాయుడు ఆ చెంప ఈ చెంప వాయిస్తాడని అన్నారు. మహిళలను సంకరజాతి అని సజ్జల అన్నాడు.. అన్నం తినే వ్యక్తి ఇలా మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచుమర్తి అనురాధ ఆగ్రహం..
వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురించి ఆయన మాట్లాడిన మాటలు నీచాతి నీచంగా ఉన్నాయని దానికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆమె తెలిపారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఓ పిచ్చికుక్కలా వాగుతున్నారని, నువ్వు మాట్లాడిన మాటలు నీ కుటుంబ సభ్యులు చూస్తే చెప్పుతో కొడతారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు సంకరజాతి, వేశ్యలు, పిచాచులు అంటూ మహిళలను కించపరుస్తున్నారని ఆమె అన్నారు. టిడిపి దాడులకు వ్యతిరేకం అని.. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడితో టిడిపికి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.
సోమిరెడ్డి కామెంట్స్..
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి పట్ల మాట్లాడిన భాషని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పట్ల అనుచితంగా మాట్లాడిన సంస్కార హీనుడు ప్రసన్న అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడుకోవడం, వదిలేయడం, పొగడటం, తిట్టడం, కాళ్లు పట్టుకోవడం ప్రసన్న నైజం అని విమర్శలు గుప్పించారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొడుకుగా ఆ కుటుంబాన్ని భ్రష్టు పట్టించాడని విమర్శించారు ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆది దంపతులు అని పొగిడాడని.. ఇప్పుడు అదే నోటితో మహిళా ఎమ్మెల్యేని నీ నోటికొచ్చినట్లు మాట్లాడతావా? అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి తీరుపై తీవ్రంగ స్పందించారు. భార్యా భర్తల మధ్య తగవులు పెట్టే ప్రయత్నం చేస్తావా? అని ఫైర్ అయ్యారు. ప్రసన్న మాటలని సభ్య సమాజం ఒప్పుకోదన్నారు. ‘1996 పార్లమెంటు ఎన్నికల్లో లక్ష్మీపార్వతి చెంతన చేరి, చంద్రబాబుని ఇంటికి వెళ్లి కొడతా అన్నావు. ఎన్నికల తరువాత బాబు కాళ్లు పట్టుకున్నావు. షర్మిల పాదయాత్రలో చంద్రబాబుని చెట్టుకు కట్టేసి కొడతానన్నావు. నా తల్లిని, తండ్రిని కాకాణి నీచంగా మాట్లాడితే ఖండించాల్సింది పోయి, నన్నే విమర్శిస్తావా? నీకు సిగ్గు లేదా?’ అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి తీరుపై సోమిరెడ్డి నిప్పులు చెరిగారు.
కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ..
మహిళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడడం యావత్ మహిళలు తలదించుకునేలా ఉండడం సిగ్గుచేటు అని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కదిరిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆస్తికోసం తల్లి చెల్లిని మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అధికారం కోసం సొంత బాబాయ్ నీ హత్య చేసి చెల్లెలు అయిన సునీత రెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళలను వచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును తనే సమాధి కట్టుకున్నారని తెలిపారు. కులాలు ,మతాల మధ్య చిచ్చుపెట్టీ రాజకీయ లబ్ధి పొందినది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబమే అని తెలిపారు. మహిళలను వేధిస్తున్న ముఠా వైసిపిలో కొనసాగుతున్నదని ప్రజల బుద్ధి చెప్పిన వారిలో మార్పు రాలేదన్నారు. మహిళా ఎమ్మెల్యే పట్ల వైసిపి నేత అనుచితంగా మాట్లాడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.
సీఎం సీరియస్..
ఇదిలాఉండగా.. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు తెలుగు మహిళలు కూడా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ర్యాలీగా వెళ్లి కొవ్వూరు పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసు ఉన్నతాదికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెం నాయుడు, సవిత ఇతర మంత్రులు సైతం ప్రసన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిని, చెల్లిని బయటకు పంపిన జగన్‌ను చూసి ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకొని బూతులు మాట్లాడితే చూస్తూ ఊరుకునేందుకు ఇది జగన్ జమానా కాదని, కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
Also Read:
పర్యటనల పేరుతో విధ్వంసానికి జగన్ మాస్టర్
ఇలాంటి వారికి ఎంతడిగినా అప్పు ఇవ్వకండి..
డ్రీమ్‌లైనర్‌కు ఢోకా లేదు.. ఎయిరిండియా
For More Andhra Pradesh News and Telugu News..