YS Jagan Master Plan: పర్యటనల పేరుతో విధ్వంసానికి జగన్ మాస్టర్ ప్లాన్.!!
ABN , Publish Date - Jul 08 , 2025 | 09:30 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. దీంతో వైసీపీ ప్రతిపక్ష హోదా సైతం పొందలేదు. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అలాంటి వేళ.. వైఎస్ జగన్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
పరామర్శల పేరుతో దండయాత్రలు చేయడం.. ఏదో ఒక అలజడి రేపడం.. రాష్ట్రంలో దానిని చర్చనీయాంశంగా మార్చి శాంతిభద్రతల విఫలమయ్యాయని గుడ్డ కాల్చి నెత్తిన వేయడం ఇది వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అలవాటుగా మారింది. ఉనికి కోసం పాట్లు, నేతలను నిలుపు కొనేందుకు అగచాట్లు, కార్యకర్తల సమీకరణకు టార్గెట్‌లు పెడుతూ జగన్ పరామర్శ యాత్రలు చేస్తున్నారని అధికార పార్టీతో పాటు కూటమి పక్షాల నేతలు విమర్శిస్తున్నారు.
ఇప్పటి వరకు చేసిన ప్రతి పరామర్శ యాత్ర వివాదాస్పదంగా మారడంతో పాటు వైసీపీకి చెందిన అమాయక కార్యకర్తలపై కేసులు కూడా నమోదవుతున్నాయి. జన సమీకరణ పేరుతో వైసీపీ నేతలను రెచ్చగొట్టి కార్యకర్తలను కేసుల్లో ఇరిక్కిస్తున్నారు. ఇప్పుడు తోతాపురి మామిడి పేరుతో తల తోకా లేని రాజకీయం చేస్తున్నారంటూ వైఎస్ జగన్‌పై కూటమిలోని పార్టీలు మండిపడుతున్నాయి.
సంక్షోభాలు సృష్టించడం, పరామర్శలు చేయడం వైసీపీ అధినేత జగన్‌కు అలవాటుగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో కూటమి పక్షాలు ఇంటింటికి వెళుతున్నాయి. చేసిన పనులు చెప్పుకోవడమే కాకుండా ప్రజలు చెప్పిన సమస్యలను కూడా ఆలకిస్తున్నాయి. సమస్యలకు పరిష్కారం కూడా కనుగొనే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుండడంతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీసింది. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేదని అక్కడ రైతులను పరామర్శించేందుకు జగన్ వెళుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కానీ ఆయన యాత్రకు భారీ జన సమీరణను చేపట్టడమే కాకుండా మండలాల వారీగా టార్గెట్‌లు సైతం పెట్టింది.
గతంలో జగన్ చేసిన ప్రతి పర్యటనలో కూడా వివాదం చోటు చేసుకోవడం... తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామానికి వెళ్లిన సమయంలో సాక్షాత్తూ వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందే ఆ పార్టీ కార్యకర్త సింగయ్య పడి మరణించారు. అతడిని పక్కకు లాగేసి పొదల్లో పడేసి జగన్ వాహనంతోపాటు ఆయన కాన్వాయి ముందుకు వెళ్లింది. ఆ తరువాత సింగయ్య మరణించారు. కనీసం అతడి కుటుంబాన్ని జగన్ పరామర్శించ లేదు. అయితే సింగయ్య సతీమణిని తన ఇంటికి పిలిపించుకొని వైఎస్ జగన్ మాట్లాడడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
రెంటపాళ్ల పర్యటలోనే మరో ఇరువురు గుండెపోటుతో మరణించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలను రప్పా, రప్పా నరుకుతామని ప్రదర్శించిన ఫ్లకార్డులు వివాదంగా మారాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ అక్కడ పోలీసులు విధించిన నిబంధనలు తుంగలో తొక్కారు. దీంతో పాటు ఆయన బెంగుళూరు నుంచి వచ్చి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందంటూ ప్రచారం చేశారు.
విండ్ షీల్డ్ పగిలితే హెలి కాప్టర్ తిరిగి ఎలా వెళ్లిందని పోలీసులు ఎదురు ప్రశ్నించారు. అదీకాక పోలీసులను వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంపై పోలీసు అధికారుల సంఘం స్పందిస్తూ మండిపడింది. ఇక గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ మిర్చి టిక్కీలను కొంత మంది వైసీపీ కార్యకర్తలు దొంగిలించారు. మార్కెట్ యార్డ్‌లోకి వెళ్లకుండా రోడ్డు మీదనే రైతులను పరామర్శించినట్లు నటించి జగన్ చేతులు దులుపుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లేందుకు అతి పెద్ద రహదారి ఉండగా ఇరుకు సందుల్లో నుంచి జగన్ కాన్వాయిని మళ్లించారు. పక్క గ్రామాల నుంచి తరలించిన ప్రజానీకాన్ని ఆ ఇరుకు సందుల్లో ఉండి డ్రోనులతో విజువల్స్ తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయించారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు సాక్షి టీవీలో చేయడంతో తమకు క్షమాపణ చెప్పాలని, పొదిలిలో మహిళలు నిరసన వ్యక్తం చేస్తుండగా వారిపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు కానిస్టేబుల్‌తో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా పరామర్శల పేరుతో నెలకో జిల్లాకు వెళ్లడం.. అక్కడ రచ్చ చేయడం వైసీపీ అధినేత జగన్ అలవాటుగా మారిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళుతున్న జగన్ పరామర్శకంటూ దరఖాస్తు చేసుకొని.. తన వెంట పది వేల మంది వస్తారని బందోబస్తు కల్పించాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరామర్శకు పది వేల మంది ఏమిటని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. బలప్రదర్శన కాదని కేవలం 500 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ఇప్పటికే వైఎస్ జగన్‌కు స్పష్టం చేశారు. బుధవారం బంగారుపాళ్యం పర్యటనకు వెళ్తున్న వైఎస్ జగన్.. తన పర్యటనకు భారీగా జన సమీకరణ చేయాలని ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాల వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటన కోసం 25 వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలకు ఇప్పటికే సమాచారం అందింది.
ప్రతి మండలం నుంచి వందల కార్లతో రావాలని సందేశాలు సైతం పంపారు. ఆయన పరామర్శకు కాకుండా బలప్రదర్శనకు వెళుతున్నారని నిఘా వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక అందించినట్లు సమాచారం. రొంపిచర్ల, పులిచర్ల, సొదెం, స్వామల, చౌడేపల్లి, నగరి, పుత్తూరు, నిండ్రా, వడమాల పేట, విజయపురం, కే నగరం, వెదురు కుప్పం, జీడీ నెల్లూరు, బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల నుంచి ఒక్కొక్క మండలానికి 25 వాహనాలు, 500 బైకులకు తగ్గకుండా రావాలని లక్ష్యంగా పెట్టారంటూ రాష్ట్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది.
అదీకాక కడప జిల్లా పులివెందులతోపాటు పరిసర నియోజకవర్గాల నుంచి కూడా ప్రజానీకాన్ని సమీకరించేందుకు మంగళవారం సాయంత్రానికే అక్కడ వైసీపీ నేతలకు ఫోన్లు చేసి మరీ వాహనాలు పంపారు. బుధవారం ఉదయానికి బంగారుపాళ్యానికి చేరుకునే విధంగా చూడాలని నేతలు నిర్దేశించారు. ఈ బల ప్రదర్శన ద్వారా తనకు రాయలసీమలో బలం పెరిగిందని చెప్పుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ప్రజలకు చూపించేందుకే వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని పరామర్శల పేరుతో ఈ టూర్లు నిర్వహించి శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు
ఆధార్‌తో కొత్త మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..
For AndhraPradesh News And Telugu News