Supreme Court : వైసీపీ నేత గౌతంరెడ్డికి ముందస్తు బెయిల్
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:13 AM
విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన ఉమామహేశ్వరశాస్ర్తి స్థలాన్ని గౌతంరెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి.

విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతంరెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది. విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన ఉమామహేశ్వరశాస్ర్తి స్థలాన్ని గౌతంరెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరశాస్ర్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో గౌతంరెడ్డి సహా మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గౌతంరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తిరస్కరించింది. గతేడాది డిసెంబరు 18న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేబీ పార్టివాలా, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ... ఉద్దేశపూర్వంగా కేసు పెట్టారని, కేసులో సహ నిందితులందరూ బెయిల్ పైనే ఉన్నారని, గౌతంరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం తెలిపారు. గౌతంరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం, గౌతంరెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది.