AP Govt : ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీలతో పర్యవేక్షణ
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:03 AM
మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
10,58,892 విద్యార్థులకు 1,535 కేంద్రాలు
పరీక్షల ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ సమీక్ష
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సజావుగా పరీక్షలు సాగేందుకు పరీక్ష కేంద్రాలను సీసీ టీవీలతో పర్యవేక్షించనుంది. మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,58,892 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం ఇంటర్ విద్యామండలి 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మరో 67,952 మంది 325 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సీఎస్ కె.విజయానంద్ గురువారం సచివాలయంలో సమీక్షించారు. మొత్తం పరీక్షా కేంద్రాల్లో 68 సున్నితమైన కేంద్రాలు ఉన్నాయని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. పరీక్షల సమయంలో పేపరు లీకేజీ అంటూ తప్పుడు వార్తలు ప్రసారం, వ్యాప్తిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్‌కు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఆ పరిధిలో జిరాక్స్, నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో 18004251531 అనే టోల్‌ఫ్రీ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏర్పాట్లపై ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని కేంద్రాలను సీసీ టీవీల కవరేజ్‌తో అనుసంధానం చేస్తున్నామని, చీఫ్ సూపరింటెండెంట్‌లు లైవ్ స్ర్టీమింగ్‌ను పర్యవేక్షిస్తారని చెప్పారు.
ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకోవాలని, పరీక్ష ముగిశాక జవాబుపత్రాలను స్పీడ్ పోస్టు ద్వారా పంపాలని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్ ఉపకరణాలను నిషేధించారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌కు ఒక కీప్యాడ్ ఫోన్‌ను ఇస్తారు. సెట్ నంబరు, మార్పులు, అత్యవసర సమాచారానికి ఆ ఫోనును మాత్రమే వినియోగించాలి. ఆ ఫోనులోని సిమ్ కార్డును కూడా ఇంటర్ బోర్డే ఇవ్వనుంది.
175 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష
ఈనెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఏర్పాట్లపైనా సీఎస్ సమీక్షించారు. 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరావుతారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9.45 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించబోరని ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ ఏఆర్ అనురాధ తెలిపారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు 2.45 లోపే విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలన్నారు.