Srisailam Dam Safety: శ్రీశైలం రాతి గోడలకుసపోర్టు వాల్స్
ABN , Publish Date - May 01 , 2025 | 04:41 AM
శ్రీశైలం డ్యాం రాతి గోడలను పరిరక్షించేందుకు సపోర్టు వాల్స్ నిర్మించాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించింది. ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రభావంతో డ్యాం గోడలు దెబ్బతినకుండా శాస్త్రీయ మరమ్మతులు చేయాలని నివేదికలో తెలిపింది.
కొండ భాగం కోతకు గురికాకుండా చూడాలి
రాష్ట్రానికి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన
జింబాబ్వే డ్యాం తరహాలో ప్లంజ్‌పూల్ మరమ్మతులు
అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ బృందం సూచన
మరమ్మతులకు టెక్నాలజీ, డిజైన్లు ఇస్తామని వెల్లడి
అమరావతి, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలకు జీవన రేఖ శ్రీశైలం జలాశయాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉందని డ్యాం రాతి గోడలకు సపోర్టు వాల్స్ నిర్మించే మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సూచించారు. డ్యాం ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడ్డ భారీ గొయ్యిని ఆయన బృందం మంగళవారం రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించింది. ప్లంజ్‌పూల్‌లో 27 నుంచి 47 మీటర్ల దిగువ వరకు గొయ్యి ఏర్పడిందని గుర్తించింది. దీనివల్ల డ్యాం గోడలు దెబ్బతినే ప్రమాదం ఉందని జైన్ బృందం వెల్లడించింది. ‘జలాశయాన్ని అనుకుని ఉన్న కొండ భాగంలో భూమి కోతకు గురవుతోంది. ఇది క్రమేణా జలాశయానికి ప్రమాదకారిగా మారుతుంది. ప్లంజ్‌పూల్ వద్ద గొయ్యి భారీగా ఉంది. జింబాబ్వేలోని కరీబా జలాశయం వద్ద కూడా గతంలో ఇంత పెద్ద స్థాయిలో గొయ్యి ఏర్పడింది. దీనికి శాస్త్రీయంగా మరమ్మతులు చేపట్టారు. ఇందుకు పదేళ్లు పట్టింది. శ్రీశైలం జలాశయం పునాదులు పటిష్ఠంగా ఉన్నాయి. నిర్మాణ సమయంలో రాతి గోడలను నిర్మించారు. అయితే సిమెంట్ లైనింగ్ చేయకపోవడం వల్ల గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే భవిష్యత్‌లో నీరు ఎగచిమ్మే అవకాశముంది. ప్లంజ్ పూల్ గొయ్యి ప్రభావంతో ప్రాజెక్టు గోడలు దెబ్బతినకుండా, పునాదులు కోతకు గురికాకుండా ఉండేలా మరమ్మతులు చేపట్టేందుకు ప్రాధాన్యమివ్వాలి.
మరమ్మతు చేయాలంటే ముందస్తుగా గోతిలోని నీటిని తోడేయాలి. జలాశయం గోడలను పటిష్ఠపరచడంలో భాగంగా దిగువ భాగాన బ్యాక్ వాటర్ రాకుండా నివారించేందుకు కాఫర్ డ్యాంను నిర్మించాలి. జలాశయానికి తక్షణ ప్రమాదం లేనప్పటికీ.. డ్యాం మరమ్మతు పనుల కోసం రహదారి ఏర్పాటు చేసుకోవాలి. ఈ రహదారి ఆధారంగా ప్రాజెక్టు గోడల్ని పటిష్ఠం చేయాలి. త్వరలోనే ఈ మరమ్మతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజైన్లను అందజేస్తాం’ అని జైన్ బృందం తెలిపింది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్లంజ్‌పూల్ మరమ్మతు పనులు చేపట్టాలని జల వనరుల శాఖ నిర్ణయించింది.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..