TDP Vs YSRCP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. టీడీపీ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు..
ABN , Publish Date - Feb 17 , 2025 | 08:46 AM
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొమ్మినాయుడు వలస గ్రామానికి చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఎప్పట్నుంచో భూ వివాదం నడుస్తోంది.

శ్రీకాకుళం: వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. వరసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కూటమి కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. గత వైసీపీ సర్కార్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ చూసుకుని అప్పుడు యథేచ్ఛగా దాడులు చేశారు. టీడీపీ నేతలపై విచక్షణారహితంగా భౌతికదాడులకు దిగారు. తిరిగి వారిపైనే కేసులు పెట్టి వేధించారు. అందుకే రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో జగన్ సర్కార్‌ను కూలదోశారు. ప్రభుత్వం మారినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కూటమి శ్రేణులపై వరస దాడులు చేస్తూ అదే రీతిలో రెచ్చిపోతున్నారు.
మెున్నటికిమెున్న.. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ మూకలు హత్యాయత్నం చేశాయి. ఎమ్మెల్యే చింతమనేని డ్రైవర్, గన్ మెన్‌పై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దాడికి చేశారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన చింతమనేని కారుకు తమ వాహనాన్ని అడ్డుపెట్టారు అబ్బయ్య చౌదరి. కారు తీయమని చెప్పినా వినకుండా ఎమ్మెల్యే డ్రైవర్, గన్ మెన్‌ని అబ్బయ్య చౌదరి దాడి చేసి దుర్భాషలాడారు. ఈ ఘటనపై ఏలూరు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, తాజాగా అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మినాయుడు వలస గ్రామానికి చెందిన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఎప్పట్నుంచో భూ వివాదం నడుస్తోంది. అయితే ఆదివారం రాత్రి ఇదే విషయమై వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. కాసేపటి తర్వాత సదరు ఫ్యాన్ పార్టీ కార్యకర్త తమ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులతో కలిసి వీరంగం సృష్టించాడు. దీంతో టీడీపీ కార్యకర్తకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు నిలబడ్డాయి.
ఈ నేపథ్యంలోనే వైసీపీ మూకలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. టీడీపీ వర్గీయులు సైతం ప్రతిదాడులు చేయాల్సి వచ్చింది. పరస్పరం దాడుల్లో ఇరువర్గాలకు చెందిన 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బాధితులను రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొమ్మినాయుడు వలసలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఘర్షణలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Road Accident: వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఎంత ఘోరం జరిగిందంటే..
Gold and Silver Prices Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..