Road Accident: వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఎంత ఘోరం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 17 , 2025 | 07:44 AM
ఆంధ్రప్రదేశ్: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.

గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. నారాకోడూరు- బుడంపాడు గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు, ఆటో (RTC Bus- Auto Collision) ఢీకొని ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. సుద్దపల్లి (Suddapalli) గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు వ్యవసాయ పనుల నిమిత్తం ఇవాళ (సోమవారం) ఉదయం ఆటోలో బయలుదేరారు. అయితే నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్యకు రాగానే ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వీరి వెళ్తున్న ఆటోను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అరుణ కుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద ధాటికి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు పోలీసులు, 108కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
అయితే ఉదయం వేళ వాతావరణాన్ని పొగమంచు కమ్మేయడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పొగమంచు కారణంగానే ఎదురుగా ఉన్న ఆటో కనిపించక దానిపైకి బస్సు దూసుకెళ్లినట్లు తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకేసారి గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో సుద్దపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
Gold and Silver Prices Today: మహిళలకు శుభవార్త.. బంగారం ధర ఎంత తగ్గిందంటే..