Guntur: ఆఖరి మజిలీకి ఓ అతిథి గృహం
ABN , Publish Date - Sep 04 , 2025 | 10:38 AM
ఆ మధ్య కాలంలో అటవీశాఖ రాష్ట్ర అధికారి ఒకరు హఠాత్తుగా మరణించారు. తాడేపల్లి(Tadepalli)లో ఆయన ఉండేది అద్దె ఇల్లు కావటంతో శవాన్ని అక్కడికి తీసుకురావద్దని ఇంటి యజమాని కరాఖండిగా చెప్పేశారు. దాంతో చేసేది లేక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు గుంటూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచి అక్కడ నుంచే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
- 450 శవాలకు అక్కడి నుంచే అంతిమ యాత్ర
ఆ మధ్య కాలంలో అటవీశాఖ రాష్ట్ర అధికారి ఒకరు హఠాత్తుగా మరణించారు. తాడేపల్లి(Tadepalli)లో ఆయన ఉండేది అద్దె ఇల్లు కావటంతో శవాన్ని అక్కడికి తీసుకురావద్దని ఇంటి యజమాని కరాఖండిగా చెప్పేశారు. దాంతో చేసేది లేక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు గుంటూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచి అక్కడ నుంచే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన ఉన్నత స్థాయి అధికారి కాబట్టి అలా కార్యాలయంలో నైనా అవకాశం కల్పించారు. అదే పేదలు, దిగువ మధ్య తరగతి వారు మరణిస్తే వారి సంగతి ఇక చెప్పనక్కరలేదు.
అద్దె ఇంట్లో ఉంటున్నారు కాబట్టి శవాన్ని కచ్చితంగా రోడ్డు మీద ఉంచాల్సిందే. ఆ రోజే ఏ వానో, వరదో వస్తే వారి కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతం. తమ వారికి కనీసం గౌరవప్రదంగా అంతిమ యాత్ర నిర్వహించుకోలేక పోయామనే దిగులు వారిని జీవితాంతం వెంటాడుతుంది. ఇలా ఎన్నో భౌతిక కాయాలకు అంతిమ యాత్రలో చేదు అనుభూతి కలిగిన ఉదంతాలను కళ్లతో చూసిన తర్వాత ఆవిర్భవించిందే శ్రీ విజేత సేవా సమితి. ఇది గుంటూరు నగరంలోనే ఉంది. హౌసింగ్ బోర్డు నుంచి అంకిరెడ్డి పాలెం వెళ్లే దారిలో ఒక పెద్ద ఇంటిని ఈ సేవా సంస్థ కార్యకలాపాల కోసం నిర్మించారు. కుల, మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా దాన్ని ఉచితంగా వాడుకోవచ్చు. ప్రాణం పోగానే భౌతిక కాయాన్ని అక్కడకు తీసుకువచ్చి అంతిమ యాత్ర నిర్వహించుకోవచ్చు.
(గుంటూరు సిటీ, ఆంధ్రజ్యోతి)
2003లో ఆవిర్భవించిన శ్రీ విజేత సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు ఏటీ అగ్రహారంలోని శ్రీ విజేత హైస్కూల్ డైరెక్టర్ చెరుకూరి శ్రీహరి దాన్ని స్థాపించారు. కొన్ని వేల అనాధ శవాల కు ఈ సంస్థ ద్వారా అంతిమ సంస్కారాలు నిర్వ హించారు. 2020లో అంకిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డులో శ్రీ విజేత సేవా సంస్థ పేరుతో ఒక పెద్ద ఇంటిని నిర్మించారు. అప్పటి నుంచి ఇల్లు లేకుండా మరణించిన వారి భౌతిక కా యాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అంతిమ సంస్కారం నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించారు. అక్కడకు తీసుకువచ్చే శవాల కోసం ప్రత్యేకంగా ఫ్రీజర్ బాక్స్‌లు కూడా అందుబాటులో ఉంచారు. అంతిమ యాత్ర సమయంలో వాడుకోవ టానికి స్వర్గ ధామం పేరుతో ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. రూపాయి ఖర్చు లేకుండా స్మశాన వాటికకు తీసుకు వెళ్ళటానికి వీలుగా రవాణా సదుపాయం కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 450కి పైగా శవాలను ఇక్కడకు తీసుకువచ్చి అంతిమ యాత్రలు నిర్వహించారు.
15 రోజుల వరకు ఉండే అవకాశం
మరణించిన వారి కుటుంబసభ్యులను 15 రోజుల వరకు కొంతమంది ఇళ్లలోకి రానివ్వరు. ఆ ఇబ్బందిని కూడా గమనించిన శ్రీ విజేత సేవా సంస్థ డైరెక్టర్ చెరుకూరి శ్రీహరి మరో ఏర్పాటు చేశారు. కేవలం అంతిమ యాత్ర నిర్వహించు కోవటం మాత్రమే కాకుండా మరణించిన వారి కుటుంబ సభ్యులు 15 రోజుల పాటు ఇక్కడే ఉండే సౌలభ్యం కల్పించారు. అవసరమయితే పెద్ద కర్మ రోజున బంధువులకు భోజనాలు పెట్టుకోవటానికి కూడా ఏర్పాట్లు చేశారు.
ప్రతి శనివారం పిడికిలి బియ్యం
శ్రీ విజేత సేవా సంస్థ డైరెక్టర్ చెరుకూరి శ్రీహరి నగరంలోని ఏటీ అగ్రహారం రెండో లైన్‌లో హైస్కూల్ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతి శనివారం ఒక పిడికెడు బియ్యం తీసుకురావాలని చెబుతారు. వాటితో భోజనం తయారు చేసి వారానికి ఒకసారి గుంటూరు ప్రభుత్వాసు పత్రి వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. విద్యార్థులకు ఆహారం విలువ తెలియ జే యడానికి ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నట్లు చెరుకూరి శ్రీహరి తెలి పారు.
ఎన్నో ఉదంతాలు చూసిన తర్వాత...
అద్దె ఇంట్లో మరణిస్తే శవాన్ని ఇంట్లోకి రానివ్వరు. ఇటువంటి ఉదంతాలు నేను చాలా చూశాను. మనిషి జీవించినంత కాలం ఎంతో గౌరవంగా బతుకుతారు. వాళ్లు మరణించిన తర్వాత కూడా అదే గౌరవంతో అంతిమ యాత్రకు అవకాశం కల్పించాలన్న ఆలోచనతోనే ఈ ఇంటిని ఏర్పాటు చేశాము. ఎంతో మంది దీన్ని ఉచితంగానే వాడుకుంటారు. స్థోమత కలిగిన వాళ్లు అయితే విద్యుత్ బిల్లు ఇస్తారు. అదీ లేకుంటే ఉచితంగానే అన్ని చేసుకునే అవకాశం ఉంది.
-శ్రీ విజేత సేవా సంస్థ డైరెక్టర్ చెరుకూరి శ్రీహరి, గుంటూరు
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News