Share News

AP police : సునీల్‌కుమార్‌తో నీకు సంబంధమేంటి?

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:08 AM

సీఐడీ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌తో నీకున్న సంబంధం ఏమిటి.. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ‘ప్రైవేటు వ్యక్తి’ తులసిబాబును విచారణాధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది.

AP police : సునీల్‌కుమార్‌తో నీకు సంబంధమేంటి?
Tulasi Babu

  • ఆ రోజు సీఐడీ ఆఫీసులో ఎందుకున్నావ్‌?

  • అగ్రిగోల్డ్‌ నిధులు ఎలా మళ్లించారు?

  • రఘురామకు చిత్రహింసల కేసులో..

  • తులసిబాబుపై పోలీసుల ప్రశ్నలవర్షం

  • విజయ్‌పాల్‌తో కలిపి విచారణ

  • నలుగురు ముసుగు మనుషులపై ఆరా

ఒంగోలు క్రైం/గుంటూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌తో నీకున్న సంబంధం ఏమిటి.. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ‘ప్రైవేటు వ్యక్తి’ తులసిబాబును విచారణాధికారి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. రఘురామ గుండెలపై కూర్చొని దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబును.. సీఐడీ విశ్రాంత ఏఎస్పీ విజయ్‌పాల్‌ను కలిపి ఆయన బుధవారం సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటికే సేకరించిన పక్కా ఆధారాలతోపాటు సాంకేతిక సాక్ష్యాలతో బుధవారం రాత్రి తులసిబాబును ప్రశ్నించినట్లు సమాచారం. రఘురామ రాసిన లేఖతో పాటు సీఐడీ కార్యాలయంలో జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌పై అనేక సాక్ష్యాలను అతడి ముందుంచినట్లు తెలిసింది. వాటిని చూసిన అతడికి ముచ్చెమటలు పట్టినట్లు సమాచారం. ‘ఆ రోజు సీఐడీ కార్యాలయంలో ఎందుకు ఉన్నావు? సీఐడీ లీగల్‌ అడ్వయిజర్‌గా నిన్ను ఎవరు నియమించారు..? మీ సొంత గ్రామమైన బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలం రాంకూరులో అగ్రిగోల్డ్‌ నిధులు ఎలా మళ్లించారు’ అని ఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. వీటికి తులసిబాబు నుంచి సరైన సమాధానాలు రాలేదని సమాచారం. ఈ క్రమంలో పోలీసులు తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో అతడిని బుధవారం రాత్రి పదిన్నర గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి తాలూకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం విజయ్‌పాల్‌ను, సాయంత్రం తులసిబాబును పటిష్ఠ భద్రత మధ్య గుంటూరుకు తరలించారు. తులసిబాబును రాత్రి 11 గంటల సమయంలో గుంటూరులోని స్పెషల్‌ మొబైల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.


వాదనల అనంతరం అతడిని 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపారు. రాత్రికి రాత్రే అతడిని జిల్లా జైలుకు తరలించారు. ఇంకోవైపు.. ఈ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో తులసిబాబు కాక మిగతా ముగ్గురి పాత్రపైనా పోలీసులు దృష్టిసారించారు. కస్టడీలో ముఖానికి మాస్కులు ధరించి ఉన్న నలుగురు ఎవరనే అంఽశంపైనా ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో విజయ్‌పాల్‌ నుంచి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. తులసిబాబును కూడా పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. కాగా.. గుంటూరు కోర్టుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. తులసిబాబు వెంట రావడం చర్చనీయాంశమైంది. పీవీ సునీల్‌కుమార్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఇతడు ఆ తర్వాత వెనిగండ్ల రాముకు సన్నిహితుడిగా మారారు. తాజా పరిణామాలు టీడీపీ వర్గాల్లో ఇది కలకలం రేపుతున్నాయి.

‘తులసి’ ఓవరాక్షన్‌పై పోలీసు యాక్షన్‌

ఒంగోలులో తమపై రెచ్చిపోయిన తులసిబాబు అనుచరులపై పోలీసు యాక్షన్‌ మొదలైంది. రఘురామరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు బుధవారం తన అనుచరులతో భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీగా విజయవాడ నుంచి ఒంగోలు వచ్చారు. వారంతా ఇక్కడి ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట హల్‌చల్‌ చేశారు. కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిని కొందరు బెదిరించారు. ‘యూనిఫాంతో గుడివాడ రండి.. మీ అంతు చూస్తాం.. ఎస్పీ కార్యాలయం ఊరి బయట కట్టుకోండి’ అంటూ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్‌ఐ ఒకరు తాలూకా పోలీసు స్టేషన్‌లో తులసిబాబు అనుచరులపై ఫిర్యాదు చేశారు. 20 మందికిపైగా గుంపు వచ్చి తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని.. జిల్లా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని నెట్టుకుంటూ లోపలికి చొరబడే ప్రయత్నం చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మూకలో కృష్ణా జిల్లాకు చెందిన సత్యసాయి అలియాస్‌ సాయి ఉన్నట్లు వెల్లడైందన్నారు. గురువారం ఒంగోలు తాలూకా సీఐ అజయ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 10 మందిని గుర్తించారు.

Updated Date - Jan 10 , 2025 | 08:15 AM