Prakasam District : కన్నకొడుకే కాలయముడయ్యాడు!
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:28 AM
బ్లేడుతో విచక్షణారహితంగా తలపై బలంగా గాయపర్చి హత్య చేశాడు ఓ వ్యక్తి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువులో శనివారం అర్ధరాత్రి ఈఘటన చోటుచేసుకుంది.

మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు
దొనకొండ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నిద్రిస్తున్న తండ్రిని చెట్లు కోసే రంపం బ్లేడుతో విచక్షణారహితంగా తలపై బలంగా గాయపర్చి హత్య చేశాడు ఓ వ్యక్తి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువులో శనివారం అర్ధరాత్రి ఈఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన పైడిపోగు ఏసు(78) రైల్వేశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. కొన్నేళ్ల క్రితం భార్య మృతి చెందింది. పెద్ద కుమారుడు నాగేశ్వరరావు అదే గ్రామంలో వేరే ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకొని జీవిస్తున్నాడు. రెండో కుమారుడు మరియదాసు, భార్య, వారి ఇద్దరు కుమార్తెలు ఏసుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిసైన మరియదాసు జులాయిగా తిరుగుతూ తరచూ ఇంట్లో గొడవపడుతుండేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఏసు ఉదయం దొనకొండకు వచ్చి ఎక్కడో ఒకచోట కాలక్షేపం చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్తుండేవారు. వారం క్రితం మరియదాసు భార్యతో గొడవపడడంతో ఆమె పిల్లలను తీసుకుని స్వగ్రామమైన పోతలపాడుకు వెళ్లిపోయింది. శనివారం తండ్రి వద్ద డబ్బులు తీసుకున్న మరియదాసు మద్యం సేవించి రోడ్డుపై పడిపోయాడు. విషయం తెలుసుకొన్న ఏసు గ్రామస్థుల సహకారంతో కొడుకును ఇంటికి చేర్చాడు. అర్ధరాత్రి సమయంలో స్పృహలోకి వచ్చిన మరియదాసు ఇంట్లో ఎవరూలేకపోవడంతో గాఢనిద్రలో ఉన్న తండ్రిపై దాడి చేశాడు. రంపం బ్లేడుతో తలపై కోయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం రోడ్డుపైకి వచ్చి తండ్రిని చంపానని మరయదాసు కేకలు వేస్తుండగా స్థానికులు అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఏసు విగతజీవిగా రక్తపు మడుగులో మంచంపై పడి ఉన్నారు. వెంటనే ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకొని మరియదాసును సమీపంలోని విద్యుత్ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మరియదాసును అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి