ఫ్లోర్ లీడర్‌కు ప్రతిపక్షనేతకు తేడా తెలియని జగన్: సోమిరెడ్డి
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:42 AM
వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గొంతు వినిపించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శాసనసభలో సవాల్ విసిరారు.

జగన్ వికృత చేష్టలతో కడుపు మండిపోతోంది: విష్ణుకుమార్‌రాజు
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గొంతు వినిపించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శాసనసభలో సవాల్ విసిరారు. మంగళవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కాదని ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటున్నాడు. చంద్రబాబు ఎంత సమయం మాట్లాడితే.. తానూ అంత సమయం మాట్లాడాలని జగన్ డిమాండ్ చేస్తుండటంలో అర్థం లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ శాసనసభలో .. చంద్రబాబు వైపు వేలెత్తి చూపిస్తూ ‘మీ దగ్గర నుంచి ఐదారుగురు సభ్యులను లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని అడగడంలో అర్థముందా? వారు అసెంబ్లీకి రాకపోతే ఆ 11 నియోజకవర్గాల ప్రజల తరపున అసెంబ్లీలో ఎవరు మాట్లాడతారు? అని నిలదీశారు.
80 ఏళ్ల ఉమ్మారెడ్డినీ పోడియం వద్దకు పంపారు: విష్ణుకుమార్‌రాజు
‘జగన్ అసెంబ్లీకి వస్తారా?.. వస్తే కూటమి ఎమ్మెల్యేలు ఏవిధంగా ప్రవర్తిస్తారో చూద్దామని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తితో చూస్తున్నారు. కానీ గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభలో జగన్, వైసీపీ సభ్యుల వికృత ప్రవర్తనను చూసిన తర్వాత కడుపు మండిపోతోంది. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు 80 ఏళ్లున్న సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కూడా పోడియం వద్దకు వెళ్లాలంటూ జగన్ సైగలు చేశారు. జగన్ తన స్వార్థపూరిత ఆలోచనలతో వైసీపీ ఎమ్మెల్యేలు తలదించుకునే పరిస్థితులు తీసుకురావడం దురదృష్టకరం’ అని విష్ణుకుమార్‌రాజు అన్నారు. సుందరపు విజయకుమార్, కలికిరి మురళీమోహన్, ఎం.మాలకొండయ్య, ఎంఎస్ రాజు, ఎన్.ఈశ్వరరావు, ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్ తీరుపై ధ్వజమెత్తారు.