YS Sharmila : దమ్ముంటే 5 ఏళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:14 AM
‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
అమిత్ షా వ్యాఖ్యలకు ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది
జగన్ పాలన విపత్తు అయితే ఐదేళ్లూ ఎందుకు ఉపేక్షించారు?
పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఏనాడైనా మాట్లాడారా?
ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ ఉద్ధరణ కాదు: షర్మిల
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ‘వైసీపీ పాలన ఓ విపత్తు’ అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ షర్మిల ఎక్స్‌లో స్పందించారు. ‘‘అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే... ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా? ఆ ఐదేళ్లూ కేంద్రంలో ఉన్నది మీరే కదా? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఆపితే అడిగారా? రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా? రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా? సొంత బాబాయి హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోంమంత్రిగా మౌనంగా ఎందుకు ఉన్నారు? భరీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా? ఐదేళ్లపాటు జగన్ మీకు దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలు బొమ్మ. పార్లమెంటులో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంపు. రాష్ట్రంలో సహజ వనరులను ‘మోదానీ’కి దొచిపెట్టే ఏజెంట్.
మీ ఇష్టారాజ్యంగా ఐదేళ్లు వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని మొసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసానికి కర్త జగన్ అయితే... కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే. విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి అండగా ఉంటాం, రూ.3 లక్షల కోట్లు ఇస్తాం, పూర్వ వైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం. రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన విశాఖ ఉక్కును ఉద్ధరించినట్లు కాదు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేసి, సొంత గనులు కేటాయించడమే అసలైన పరిష్కారం’ అని షర్మిల వ్యాఖ్యానించారు.