Weather : పొడిగాలులతోనే వేడి వాతావరణం
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:05 AM
ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు
విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): శీతాకాలం పోయి వేసవి సీజన్ వచ్చే క్రమంలో ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభం నుంచే మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి వెళ్లే క్రమంలో గాలులు పరివర్తనం చెంది ఒక్కసారిగా పొడి వాతావరణం నెలకొనడం సాధారణమేనని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెలలో వాతావరణం పొడిగా మారడంతో ఆకాశం నిర్మలంగా మారి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడంతో ఎండ పెరుగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో సముద్రం నుంచి గాలులు భూ ఉపరితలంపైకి వీస్తుంటాయన్నారు. ఈశాన్య సీజన్ ముగిసిన తరువాత గాలులు ఒకే దిశలో కాకుండా అన్ని వైపుల నుంచి వీస్తుండడంతోపాటు వేగం మందగించింది. వర్షాలు కురిసే పరిస్థితులు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు వరకూ ఇటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథకుమార్ పేర్కొన్నారు. ఇదిలావుండగా ఆదివారం రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 36.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి