Share News

Coalition Govt : ఎన్నికల’ రోడ్లు రద్దు!

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:13 AM

ఇప్పటి వరకు మొదలుపెట్టని రోడ్లు, ప్రారంభించినా 25 శాతంలోపే పురోగతి ఉన్న ప్రాజెక్టులను రద్దుచేస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది.

Coalition Govt :  ఎన్నికల’ రోడ్లు రద్దు!

  • ఇప్పటిదాకా మొదలుపెట్టనివి.. 25% దాటని పనులు కూడా

  • 2023-24 మధ్య రూ.2,300 కోట్ల విలువైన రోడ్ల పనులకు టెండర్లు

  • అత్యధిక వర్కులు వైసీపీ పెద్దలకే ఇంకొన్ని వారి బినామీలకు అప్పగింత

  • ఒక్క పనీ పూర్తిచేయని వైనం

  • వాటన్నిటినీ పరిశీలించి.. రద్దుచేసిన కూటమి సర్కారు

  • అయినా పాత కాంట్రాక్టర్లతోనే చేయించాలని కొందరు నేతల ఒత్తిడి

  • వైసీపీ నేతలతో రహస్య ఒప్పందాలు?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల సమయంలో జగన్‌ ప్రభుత్వం మంజూరుచేసిన రోడ్లు భవనాల (ఆర్‌ అండ్‌ బీ) శాఖ రహదారులు రద్దయ్యాయి. ఇప్పటి వరకు మొదలుపెట్టని రోడ్లు, ప్రారంభించినా 25 శాతంలోపే పురోగతి ఉన్న ప్రాజెక్టులను రద్దుచేస్తూ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ‘సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీఆర్‌ఐఎఫ్‌)’ కింద చేపట్టే రహదారులు కూడా భారీగా ఉన్నాయి. ఈ పరిణామం వైసీపీ నేతలకు, వారి పేరిట బిడ్లు వేసి వర్కులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు గట్టిషాకిచ్చింది. నిరుడు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు జగన్‌ సర్కారు పెద్దఎత్తున రోడ్ల నిర్మాణ పనులు ప్రకటించింది. కేంద్రం ఇచ్చే సీఆర్‌ఐఎఫ్‌ నిధులు సహా రాష్ట్ర వనరుల నుంచి రూ.2,300 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి అనుమతులిచ్చారు. 2023 అక్టోబరు నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య భారీగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. వీటిలో జాతీయ రహదారులు, సీఆర్‌ఐఎఫ్‌, నాబార్డు, విదేశీ సాయంతో నడిచే ప్రాజెక్టులు (ఈఏపీ), కేంద్ర ప్రాయోజిత పథకాల రోడ్లతో పాటు తుంగభద్ర పుష్కరాల రహదారి పనులు కూడా ఉన్నాయి.


గ్రామీణ రోడ్లను జిల్లా ప్రధాన రహదారులుగా మార్చే దశలో ఉన్నవీ ఉన్నాయి. నాటి మంత్రులు, వైసీపీ ముఖ్య నేతల సిఫారసుల మేరకు పనులను మంజూరుచేసి ఆగమేఘాలపై టెండర్లు పిలిచారు. ఇందులో సింహభాగం వారు, వారి బినామీలుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లే దక్కించుకున్నారు. ఒప్పందాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌ నాటికే కనీసం 40 శాతం పనులు చేసి ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 10 శాతం కూడా పూర్తిచేయలేదు. అత్యధిక వర్కులు ప్రారంభించనేలేదు. ఎన్నికల్లో మళ్లీ జగన్‌ గెలుస్తారని.. కొత్త ప్రభుత్వం వచ్చాక పనులు మొదలుపెడదామని చాలా మంది వేచిచూశారు. మరి కొందరు డబ్బులిస్తారో లేదోనన్న అనుమానంతో ధైర్యంగా పనులు చేయలేకపోయారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి రావడంతో.. వైసీపీ నేతలు, వారి బినామీలు పనులు నిలిపివేశారు. కొందరు చేపట్టలేమని చేతులెత్తేశారు. ఈ నేపఽథ్యంలో ఆయా పనుల తాజా పరిస్థితిపై ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులోనే నివేదిక కోరింది. పెండింగ్‌లో ఉన్న రహదారి నిర్మాణ పనులు, అసలు ప్రారంభంకాని రోడ్లపై సంబంధిత సీఈ, ఈఎన్‌సీ నివేదికలు ఇచ్చారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. అసలు ప్రారంభమే కాని పనులను రద్దుచేసింది. మొదలుపెట్టి 25 శాతం పురోగతి సాధించని వాటినీ రద్దు పద్దులో చేర్చింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే ఉత్తర్వులిచ్చారు.


పనులు పునరుద్ధరించాలని పైరవీలు

ఇంకోవైపు.. ప్రభుత్వం రద్దుచేసిన పనులను పునరుద్ధరించాలని కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తుండడం గమనార్హం. రద్దయినవాటిలో సింహభాగం వైసీపీ నేతలే దక్కించుకున్నారని తెలిసినా.. లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్నారో ఏమో.. కూటమి నాయకులే వాటిని తిరిగి ప్రారంభించాలని ఒత్తిడి తెస్తున్నారు. వాటిని కొత్తగా చేపట్టాలని కోరితే ఇబ్బంది లేదు. కానీ పాత కాంట్రాక్టర్లతోనే వాటిని కొనసాగించాలని డిమాండ్‌ చేయడం విస్మయపరుస్తోంది. వారి వెనక కొందరు వైసీపీ నేతలు ఉన్నట్లు తెలిసింది. రద్దుచేసిన రహదారి పనులను తిరిగి కొనసాగించాలనుకుంటే కొత్తగా టెండర్లు పిలిచి ఏజెన్సీలకు అప్పగించడం పద్ధతి. అలా కాకుండా పాత కాంట్రాక్టర్లతోనే చేయించాలని పైరవీలు చేయడం చర్చనీయాంశమైంది.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 03:14 AM