Share News

Anantapur : దొంగలు బాబోయ్‌.. దొంగలు!

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:06 AM

ఇళ్లలో దూరి బంగారం, నగదు దోచుకెళ్లిపోతున్నారు.. ధార్‌, బచాడే, భూరియా, చంబా, పార్థు గ్యాంగ్‌లు వరుస దొంగతనాలతో పోలీసులకు..

Anantapur : దొంగలు బాబోయ్‌.. దొంగలు!

  • రాష్ట్రంలో ఉత్తరాది ముఠాలహల్‌చల్‌

  • పక్కాగా రెక్కీ నిర్వహించి వరుస దొంగతనాలు

  • దొంగ సొత్తును పంచుకొని సొంతూళ్లకు పరార్‌

  • ఏలూరు, పల్నాడు, అనంత, తిరుపతిలో భారీ చోరీలు

  • యూపీ, రాజస్థాన్‌ వెళ్లి ఏలూరు పోలీసుల సోదాలు

  • అక్కడ అష్టకష్టాలు పడి నలుగురు నిందితుల అరెస్టు

  • మధ్యప్రదేశ్‌ గ్రామాల్లో జల్లెడ పట్టిన అనంత పోలీసులు

  • ధార్‌ ముఠాలో ముగ్గురు కీలక సభ్యులు అదుపులోకి

  • దొంగల వేటలో పల్నాడు, తిరుపతి పోలీసులు బిజీబిజీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చి మరీ ఇక్కడ ఇళ్లలో దూరి బంగారం, నగదు దోచుకెళ్లిపోతున్నారు.. ధార్‌, బచాడే, భూరియా, చంబా, పార్థు గ్యాంగ్‌లు వరుస దొంగతనాలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏలూరు, పల్నాడు, అనంతపురం, తిరుపతి.. ఇలా మూడు వారాల్లో నాలుగు భారీ దొంగతనాలు జరిగాయి. దొంగల కోసం యూపీ, రాజస్థాన్‌ వరకూ వెళ్లి గాలించిన ఏలూరు పోలీసులు రెండు వారాల పాటు అష్టకష్టాలు పడి బంగారం, వెండి రికవరీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన అనంతపురం పోలీసులు దేశంలోనే పేరు మోసిన ధార్‌ (మధ్యప్రదేశ్‌) గ్యాంగ్‌ గుట్టు రట్టు చేశారు. పెద్దమొత్తంలో బంగా రు, వజ్రాల ఆభరణాలు, లక్షలాది రూపాయల నగదు రికవరీ చేశారు. ఇదే బాటలో పల్నాడు, తిరుపతి పోలీసులు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగల కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.


ఏలూరులో పండుగ వేళ భారీ దోపిడీ

సంక్రాంతి పండుగ సమయంలో ఏలూరులోని ఒక బంగారం దుకాణం నుంచి భారీగా నగలు, వెం డి వస్తువులు దోచుకుని నలుగురు దొంగల గ్యాంగ్‌ పరారైంది. పోలీసులు సీసీ కెమెరా ఫుజేటీ ఆధారం గా వారంతా విజయవాడలో రైలెక్కినట్లు గుర్తించా రు. వారికోసం నాలుగు ప్రత్యేక బృందాలు యూపీకి, అక్కడినుంచి రాజస్థాన్‌కు వెళ్లి గాలింపు చేపట్టారు. కుల్దీప్‌ శర్మ, మనోజ్‌ కుమార్‌ను యూపీలో, మహేందర్‌సింగ్‌, రాజేశ్‌ కుష్వాను రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకొని ఏలూరు తీసుకొచ్చా రు. మొత్తం రూ.73లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు రికవరీచేసి, నిందితులను జైలుకు పంపారు.

పల్నాడులో మూడుచోట్ల చోరీలు

పల్నాడు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో సంక్రాంతి వేళ దొంగలు చోరీలకు పాల్పడ్డారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన వీరు ముందుగా విజయవాడ, గుంటూరులో బైకులు దొంగతనం చేశారు. వాటిపై పల్నాడు వెళ్లి అక్కడ ఇళ్లు దోచేశారు. అనంతరం అవే వాహనాలపై మరో ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి రైలెక్కి పారిపోయారు. వీరి కోసం ఇప్పుడు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

అనంతలో ధార్‌ గ్యాంగ్‌ కలకలం

అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని మూడు విల్లాల్లోకి చొరబడిన ధార్‌ గ్యాంగ్‌ గత నెలలో పెద్దమొత్తంలో నగదు, భారీగా బంగారు, వజ్రాభరణాలు అపహరించారు. దొంగల వేలిముద్రలు సేకరించిన అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్‌కు వెళ్లి మారుమూల గ్రామాల్లో జల్లెడ పట్టి మరీ ఈ గ్యాంగ్‌లో కీలకమైన ముగ్గురిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు నారూ పచావర్‌తో పాటు సభ్యులు సావన్‌, సునీల్‌ను జైలుకు తరలించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.


తిరుచానూరులో భారీగా బంగారం దోపిడీ

ఈ నెల మొదటివారంలో తిరుచానూరులోని సీవీఆర్‌ విల్లాల్లోకి దొంగలు చొరబడ్డారు. ముందుగా విల్లా నం.81లో కిలో బంగారం దోచుకెళ్లారు. తర్వాత పొరుగునే ఉన్న జగదీశ్‌ ఇంట్లోకి దూరి 480 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకున్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు దొంగల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అలాగే విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని గోడౌన్‌ నుంచి రూ.2.52 కోట్ల విలువైన యాపిల్‌ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను దొంగిలించిన యూపీకి చెందిన ఆరుగురు నిందితులను బిహార్‌ సరిహద్దుల వద్ద పోలీసులు పట్టుకున్నారు.

కార్డెన్‌ సెర్చ్‌ తప్పనిసరి

రాష్ట్రంలో వరుస దొంగతనాలపై పోలీస్‌ బాస్‌ హరీశ్‌ కుమార్‌ గుప్తా దృష్టి సారించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు నేరం చేసే ముందు రెక్కీ నిర్వహిస్తున్నాయని, ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కన, ఖరీదైన విల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా కార్డెన్‌ సెర్చ్‌ తప్పనిసరి చేయాలని జిల్లా ఎస్పీలకు సూచించినట్లు తెలిసింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:20 AM